- హైదరాబాద్ తర్వాత జిల్లాల్లో కూల్చివేతలు: పొన్నం
- సర్కారు భూముల్లో అక్రమ కట్టడాలనూ తొలగిస్తం
- సీఎం రేవంత్ రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తున్నరు...
- స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నరని వెల్లడి
బషీర్ బాగ్, వెలుగు: హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగిస్తున్నామని, తర్వాత ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టి అన్ని అక్రమ కట్టడాలను కూల్చేస్తామని బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, స్పీకర్‌గడ్డం ప్రసాద్‌కుమార్, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనా రెడ్డి తో కలిసి జాతీయ క్రీడా దినోత్సవాల పోస్టర్, టీష్టర్ ను ఆవిష్కరించారు.
తర్వాత మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రాష్ట్రంలో చెరువుల పరిరక్షణతో పాటు అక్రమ కట్టడాల పని పడతామన్నారు. స్వచ్ఛంద సంస్థలు, గతంలో ఎక్కడైనా చెరువు ఉండి మాయమైందని తెలిసిన స్థానికులు, ఇతరులు పోలీసులను గాని, రెవెన్యూ అధికారులను గాని సంప్రదించవచ్చన్నారు. ఎక్కడెక్కడ ఆక్రమణకు గురయ్యాయో తెలిసి ఉండి, వాటి ఆధారాలు ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు. 33 జిల్లాల్లో గ్రామాలు, మండలాలు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో చెరువులు మాయమైనా, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు వెలిశాయని తెలిసినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చన్నారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.
తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధించడం లేదని, ఒక మంచి లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని, ప్రభుత్వం చేస్తున్న పనిని హర్షిస్తున్నారన్నారు. హైదరాబాద్ ఒకప్పుడు లేక్ సిటీ గా ఉండేదని, దానికి పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు.
గత ప్రభుత్వం క్రీడా రంగాన్ని ఆగం చేసింది
రాష్ట్రవ్యాప్తంగా క్రీడలను సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని మంత్రి పొన్నం అన్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. గ్రామీణ యువత నైపుణ్యాలను బయటకు తెచ్చేలా ప్రభుత్వం సంకల్పం తీసుకుందని తెలిపారు. ఈ నెల 29న గచ్చిబౌలి స్టేడియంలో జరిగే జాతీయ క్రీడా దినోత్సవంలో సీఎం రేవంత్.. ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేసి క్రీడలను ప్రారంభిస్తారని చెప్పారు.
అన్ని జిల్లాల్లో క్రీడా దినోత్సవ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా తల్లిదండ్రుల స్పందన ముఖ్యమని, పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడా రంగాన్ని పూర్తిగా ఆగం చేసిందని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియాలను కూడా పట్టించుకున్న పాపన పోలేదని ఆయన మండిపడ్డారు.