
- బయట ప్రచారం అవుతున్న నంబర్లు పూర్తిగా తప్పు: మంత్రి పొన్నం
- ప్రతిపక్షాలు తప్పుడు గణాంకాలను ప్రచారం చేస్తున్నయ్
- ఎన్నికలు, విద్యా, ఉపాధిలో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తం
- రీ సర్వేలో అందరూ పాల్గొనేలా బీసీ సంఘాలు చూడాలని పిలుపు
హైదరాబాద్/కరీంనగర్, వెలుగు: కులగణన సర్వేకు సంబంధించి కులాలవారీగా లెక్కలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా రిలీజ్ చేయలేదని, బయట ప్రచారంలో ఉన్న గణాంకాలు పూర్తిగా తప్పు అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కావాలని తప్పుడు లెక్కలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కులగణన సర్వేలో పాల్గొనని వారికి ప్రభుత్వం ఈ నెల 16–28వ తేదీవరకు మరో అవకాశం ఇవ్వడంపై బీసీ సంఘాల నేతలు, మేధావులు, ప్రొఫెసర్లు హర్షం వ్యక్తం చేశారు.
గురువారం సెక్రటేరియెట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో బీసీ సంఘాల నేతలు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉపాధి అవకాశాల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని నిర్ణయం తీసుకోవడం పై ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ను సత్కరించారు. ప్రభుత్వం చారిత్రాత్మక, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నదని, ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని బీసీ సంఘాలు నేతలు తెలిపారు.
రిజర్వేషన్ల చట్టబద్ధతకు బిల్లుపెడ్తం
సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే లో పాల్గొనని వారికి మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తెలిపారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉపాధిలో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. మార్చి మొదటి వారంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి.. ఆ వెంటనే అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత బిల్లు పెడతామని తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేబినెట్ మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లి.. అన్ని పార్టీలను, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తుందని, ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతామని చెప్పారు.
బీసీ సంఘాల నేతలు, ప్రొఫెసర్లు , మేధావులు జిల్లాల పర్యటన చేసి కుల గణన సర్వేలో పాల్గొనని వారు ఉంటే.. వారందరూ వివరాలు ఇచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుల గణన సర్వే లో పాల్గొనని వారి కోసం ఈ నెల 16 లోపు ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొస్తున్నామని, దానికి సమాచారం ఇస్తే ఎన్యూమరేటర్ వచ్చి వివరాలు సేకరిస్తారని తెలిపారు. దీంతోపాటు ఎంపీడీవో కార్యాలయాల్లో కుల గణన సర్వే సమాచార సేకరణకు ప్రత్యేక కౌంటర్, ఆన్లైన్లో కూడా సమాచారాన్ని సేకరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నం: పీసీసీ చీఫ్
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీసీ కులగణన కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని, దీనిపై అసెంబ్లీలో బిల్లుపెట్టడంతోపాటు చట్టబద్ధత కోసం కేంద్ర పెద్దలను కలిసి, చర్చిస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం తమిళనాడు తరహాలో తెలంగాణలోనూ రాజకీయ పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ సమావేశంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, జాజుల శ్రీనివాస్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు నూతి శ్రీకాంత్ గౌడ్, ఈరవత్రి అనిల్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, వినయ్ కుమార్, తాడూరి శ్రీనివాస్ , దాసు సురేశ్, కుమారస్వామి, ఫ్రొఫెసర్లు మురళీ మనోహర్, విశ్వే శ్వర్, ప్రొఫెసర్ తిరుమల్ పాల్గొన్నారు.
బీజేపీ.. వ్యాపారుల పార్టీ
బీజేపీ.. వ్యాపారుల పార్టీ అని, ఆ పార్టీ నాయకత్వానికి కులగణన జరగడం ఇష్టం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పక్షాన సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని గుర్తుచేశారు. కరీంనగర్‌లోని డీసీసీ భవన్లో గురువా రం పొన్నం మీడియాతో మాట్లాడారు. కొందరు బీఆర్ఎస్ లీడర్లు రీ సర్వే చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారని, ఇది రీసర్వే కాదని, కేవలం గతంలో సర్వేలో సమాచారం ఇవ్వని వారు మాత్రమే వివరాలు ఇచ్చేందుకు చాన్స్ ఇచ్చినట్టు తెలిపారు.
బీఆర్ఎస్లో ఉన్న 3 ప్రధాన పదవుల్లో ఒకటి బీసీలకు, ఒకటి ఎస్సీలకు, ఇంకొకటి ఎస్టీలకు ఇప్పించేలా ఎమ్మెల్సీ కవిత కృషి చేయాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. అన్ని పదవులు ఒకే కుటుంబానికి పరిమితం చేసిన మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఎలా? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఆయన వెంట చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉన్నారు.