కాంట్రాక్టర్లు, ఇంజనీర్లలో గుబులు .. కరీంనగర్​లో కొనసాగుతున్న విజిలెన్స్ ఎంక్వైరీ

కాంట్రాక్టర్లు, ఇంజనీర్లలో గుబులు .. కరీంనగర్​లో కొనసాగుతున్న విజిలెన్స్ ఎంక్వైరీ
  • స్మార్ట్ సిటీ, మానేరు రివర్ ఫ్రంట్, సీఎం అష్యూరెన్స్ ఫండ్స్ పనులపై ఆరా
  • జంక్షన్ల బ్యూటిఫికేషన్ల పనుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తింపు
  • స్పెషల్​ ఫోకస్​ పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్​హయాంలో కరీంనగర్ సిటీలో వందల కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతోంది. అక్రమాల లెక్క తేలాకే.. పూర్తి కావాల్సిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని పనుల్లో బీఆర్ఎస్ లీడర్లు, కాంట్రాక్టర్ల కోసం అంచనాలు డబుల్, ట్రిపుల్ చేసి ఎస్టిమేషన్లు వేసినట్లు, పనుల్లో నాణ్యతను పరిశీలించకుండానే నిధులు విడుదల చేసినట్లు, టెండర్ ​షెడ్యూల్ ఇవ్వకముందే పనులు పూర్తిచేయడం వంటి అక్రమాలను విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, సీఎం అష్యూరెన్స్ ఫండ్స్, ఇతర శాఖల నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన అన్ని ఫైళ్లను స్వాధీనం చేసుకుని లోతుగా విచారణ జరుపుతున్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగిందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అసెంబ్లీ లాబీలో హాట్ కామెంట్స్ చేయడంతో ఆ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు, వారికి సహకరించిన ఇంజనీర్లలో గుబులు మొదలైంది. 

స్మార్ట్ సిటీ పనుల్లో అంతులేని అవినీతి!

స్మార్ట్ ప్రాజెక్టులో భాగంగా గతంలో మూడు ప్యాకేజీల్లో రూ.936.94 కోట్లతో పనులు ప్రారంభించారు. ఇందులో రూ.580 కోట్ల విలువైన రోడ్లు, డ్రెయినేజీ, రెయిన్ డ్రెయిన్స్, పార్కులు, తాగునీటి సరఫరా, కమాండ్ కంట్రోల్ రూమ్, గ్రీనరీ, లైటింగ్స్, జంక్షన్ల బ్యూటిఫికేషన్,  ఫుట్ పాత్ ల నిర్మాణం, పారిశుద్ధ్య పనుల నిర్వహణ, జంక్షన్లలో సిగ్నలింగ్ పనులు పూర్తయ్యాయి. ప్రధానంగా జంక్షన్ల బ్యూటిఫికేషన్ పనుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టు చౌరస్తా, నాకా చౌరస్తా, తెలంగాణ చౌక్, హౌసింగ్ బోర్డు కాలనీ చౌరస్తా తదితర కూడళ్లను ఆధునీకరించారు.

అయితే ఈ పనుల ఎస్టిమేషన్ సమయంలోనే ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణ వ్యయానికి రెండు, మూడింతలు అంచనాలు రూపొందిచడంతో కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చారనే విమర్శలు ఉన్నాయి. ఇందిరా చౌక్​లోని జంక్షన్ బ్యూటిఫికేషన్ పనులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ జంక్షన్ బ్యూటిఫికేషన్ ​కోసం దాదాపు రూ.1.30 కోట్లు ఖర్చు చేశారు. ఖర్చుకు తగ్గ పనులు చేయలేదని, చేసిన పనులకు థర్డ్ గ్రేడ్ క్వాలిటీ మెటీరియల్ వాడారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ప్యాకేజీ-3లో భాగంగా రూ.64.84 కోట్ల నిధులతో హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మించిన రోడ్లు, సైడ్ డ్రెయిన్స్ పనులపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. 

ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ పనులపై ఆరా.. 

కరీంనగర్ లో నిర్మించిన ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నిర్మాణానికి మొదట రూ.7.05 కోట్లు కావాలని అంచనా వేశారు. బిల్డింగ్ పూర్తయ్యే నాటికి దాదాపు రూ.13 కోట్లు ఖర్చు పెట్టారు. 11 నెలల కింద అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ బిల్డింగ్ ను ప్రారంభించారు. అప్పటి వరకు రూ.6 కోట్ల వరకే టెండర్లు పిలిచిన ఆర్అండ్ బీ అధికారులు.. ప్రారంభోత్సవం తర్వాత సుమారు రూ.7 కోట్ల పనులకు బిల్డింగ్ టెండర్లు ఖరారు చేశారు. పనులు ముందే పూర్తిచేసి ఆ తర్వాత టెండర్లు పిలవడం ఏమిటని కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అలాగే  అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం అష్యూరెన్స్ ఫండ్స్(రూ.125కోట్లు)తో చేపట్టిన డ్రైనేజీలు, రోడ్లు, ఇతర అభివృద్ధి పనులపైనా విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టినట్లు తెలిసింది.

మానేరు రివర్ ఫ్రంట్ పనులపై నీలినీడలు

ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మానేరు రివర్ ఫ్రంట్ సెకండ్ ఫేజ్ పనులపై నీలినీడలు అలుముకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందే టెండర్ పిలవగా, ఆ పనులను కొత్త ప్రభుత్వం రద్దు చేసి, నిధులు వెనక్కి తీసుకుంది. దీంతో పనుల కొనసాగింపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఎల్ఎండీ దిగువన మానేరు నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మించారు.

దానికి అనుబంధంగా వాటర్ ఫౌంటెయిన్స్, బోటింగ్, పార్కులతో కూడిన మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును రూపొందించారు. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా రూ.308 కోట్లతో చేపట్టిన పనుల్లో 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. అలుగనూరు - కరీంనగర్ బ్రిడ్జి నుంచి కేబుల్ బ్రిడ్జి మధ్య మానేరుకు ఇరువైపులా వాల్స్, బ్యూటిఫికేషన్ కరకట్టల నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది.

సెకండ్ ఫేజ్​లో రూ.234.72 కోట్లతో 1100 మీటర్ల మేర వాల్స్, బ్యూటిఫికేషన్, కరకట్టల నిర్మాణం, బోటింగ్, ఫౌంటెన్ల కోసం నీటిని ఆపేందుకు బ్యారేజీ, బొమ్మకల్ వరకు డ్రెయినేజీ నిర్మించాల్సి ఉంది. ఈ పనులన్నీ ఇప్పుడు నిలిచిపోయాయి. కశ్మీర్ గడ్డలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ఆరు నెలల కింద శంకుస్థాపన చేయగా పునాదుల దశలోనే నిలిచాయి. కిసాన్ నగర్ లోని వ్యవసాయ మార్కెట్ లో నిర్మిస్తున్న దుకాణాలు, పద్మానగర్ లో నిర్మిస్తున్న మార్కెట్ పనులు 80 శాతం వరకు పూర్తయి ఆగిపోయాయి.