హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. 2024, నవంబర్ 11న ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహరంలో కేటీఆర్ మీద ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసు నుండి తప్పించుకునేందుకే ఆయన ఢిల్లీలోకి వెళ్తున్నారని ఆరోపించారు. స్వయంగా కేటీయారే కార్ రేసింగ్‌కి డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు.
కార్ రేసింగ్‌లో జరిగిన అక్రమాలకు సంబంధించి విచారణ కోసం గవర్నర్ అనుమతి కోరామని.. పర్మిషన్ రాగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో అక్రమాలపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నామని.. మేము ఎవరిని జైల్లో పెడతామని అనలేదని స్పష్టం చేశారు. కార్ రేసింగ్ నుండి తప్పించుకునేందుకు అమృత్ పథకంలో అక్రమాలంటూ కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నారన్నారు. ఆయన ఏ తప్పు చేయకుంటే విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేటీఆర్ తప్పు ఒప్పుకుంటే మంచిదని సూచించారు.
కార్ రేసింగ్ కేసు నుండి బయటపడేందుకు అమృత్ పథకంలో అక్రమాలంటూ ఢిల్లీలో బీజేపీతో దోస్తీ చేసేందుకు వెళ్తున్నారని.. తనను తాను రక్షించుకేనేందుకు కేంద్రం వద్ద మోకరిల్లెందుకు వెళ్తూ ప్రజల దృష్టిని మరల్చుతున్నారని విమర్శించారు. అమృత్ పథకంలో అవినీతి జరిగితే కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చని.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. కానీ కార్ రేసింగ్ ఇష్యూలో మీ మీద జరిగే విచారణను ఆపుకునేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అనుమానం వ్యక్తం చేశారు.