కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెడితే చర్యలు : మంత్రి పొన్నం ప్రభాకర్​

కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెడితే చర్యలు : మంత్రి పొన్నం ప్రభాకర్​
  • మీర్జాపూర్‌‌లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం 
  • ఈ సీజన్​ నుంచే వరికి రూ. 500 బోనస్​
  • మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ(హుస్నాబాద్​)వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో అధిక తూకం పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్​ హెచ్చరించారు. ఈ సీజన్​ నుంచే సన్నవడ్లకు రూ.500 బోనస్​ చెల్లిస్తామన్నారు. మంగళవారం కలెక్టర్​ మను చౌదరితో కలిసి హుస్నాబాద్​ మండలం మీర్జాపూర్​లో మిల్లులో సీసీఐ పత్తి సెంటర్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే రెండు నెలల్లో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ జరుగుతుందన్నారు.

రాష్ర్టంలో కాటన్​ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా ద్వారా 322 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాలలో వెంటనే పత్తి కొనుగోళ్లను ప్రారంభించేలా కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్​చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులు తొందరపడి తక్కువ ధరకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. మిల్లర్ల కేటాయింపు జరగలేదనే సాకుతో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఆఫీసులో ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ చైర్‌‌పర్సన్ రజిత, సింగిల్​విండో చైర్మన్ శివయ్య, గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, మార్కెటింగ్​ అధికారులు తదితరులు ఉన్నారు.