మహిళలకు ఆర్థికంగా అండగా ఉంటాం : పొన్నం ప్రభాకర్​

మహిళలకు ఆర్థికంగా అండగా ఉంటాం : పొన్నం ప్రభాకర్​
  • మంత్రి పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్, వెలుగు : మహిళలకు తమ ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉండడంతోపాటు వారిని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటునందిస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మహిళాశక్తి క్యాంటీన్​ను ప్రారంభించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో శ్రీ భవానీ స్వయం సహాయక సంఘం సభ్యులు నడిపే ఈ క్యాంటీన్​ను ఓపెన్​ చేసి, అందులో వివిధ రకాల ఆహారపదార్థాలను రుచి చూశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ కేంద్రాలు, ప్రభుత్వ ఆఫీసులు, ఇతర కూడళ్లలో ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. క్యాంటీన్ల ఏర్పాటు కోసం మహిళలకు ఎలాంటి వడ్డీ లేకుండానే రుణాలు అందజేస్తామన్నారు. సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటి ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్​ హుస్నాబాద్​లో 

ఏర్పాటుచేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ క్యాంటీన్లలో నాణ్యమైన ఆహారపదార్థాలను అందిస్తూ, మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. అనంతరం ఆయన పట్టణంలోని నాగారం రోడ్డులో ఎలక్ట్రిక్​ బైక్​ షోరూంను ఓపెన్​ చేశారు. మున్సిపల్​ చైర్​పర్సన్​రజిత, కమిషనర్​మల్లికార్జున్​, వైస్​చైర్​పర్సన్​ అనిత పాల్గొన్నారు.