సన్న వడ్లకు ఈ సీజన్ నుంచే రూ. 500 బోనస్ ఇస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సీసీఐ పత్తి కొనుగోలు సెంటర్ ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందికి గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు తూకం పేరిట రైతులను మోసం చేసే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
నవంబర్, డిసెంబర్ లోపు రూ. 2లక్షల లోపు రైతుల అందరికి రుణమాఫీ జరుగుతుందన్నారు మంత్రి పొన్నం. రూ 2 లక్షల పైన ఉన్న రైతుల కోసం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. గత ప్రభుత్వం కంటే భిన్నంగా రైతుల ఇబ్బంది లేకుండా పత్తి, ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు పొన్నం.
మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు ఆయిల్ ఫామ్ తోటల పెంపకంపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. రైతుల కోసం సాంకేతిక పరమైన పని ముట్లు అందజేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు పొన్నం.