- ఫీల్డ్విజిట్చేసి 15 రోజులకోసారి రిపోర్ట్ ఇవ్వాలి: పొన్నం ప్రభాకర్
- విద్యార్థుల మీద రాజకీయాలు చెయ్యెద్దన్న మంత్రి
సిద్దిపేట, వెలుగు: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థుల మీద రాజకీయాలు చెయ్యొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సిద్దిపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీఎం సూచన మేరకు జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌తో పాటు నలుగురు ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ వెల్ఫేర్ అధికారులతో జిల్లా స్థాయి కమిటీలు, డీఎంహెచ్ఓ, డీఆర్డీవో, డీపీవో, పంచాయతీ సెక్రటరీ సభ్యులుగా మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
హాస్టల్స్, గురుకులాల్లో ఏమైనా సమస్యలుంటే ప్రిన్సిపల్స్ జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రతి 15 రోజులకు రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. అన్ని స్కూళ్లలో కిచెన్ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మెనూ మార్చాలని అన్నారు. గతంలో కిరాయిలు ఇవ్వని, మెస్ చార్జీలు చెల్లించని వాళ్లు ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్ లో గ్రీన్ చానెల్ ద్వారా మెస్ చార్జీలు చెల్లిస్తామని చెప్పారు. విద్యార్థి నాయకుడిగా పనిచేసిన తనకు సమస్యలపై అవగాహన ఉందన్నారు.
మంత్రి ఫీల్డ్ విజిట్
పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను మంత్రి ప్రభాకర్ పరిశీలించారు. స్కూల్ గ్రౌండ్, వంటగది, బాత్రూమ్స్ను చూశారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని చెట్ల పొదలను క్లియర్ చేయాలని ఆదేశించారు. వంట చేస్తున్న సిబ్బందితో మాట్లాడి వండిన అన్నం, కూరలను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన, ఆహారం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లు జరుగుతున్నాయా లేదా, స్టూడెంట్లకు హెల్త్ చెకప్ చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాల ప్రాంగణంలో మునగ, జామ, కరివేపాకు చెట్లను పెంచాలని సూచించారు.