- ప్రతిపక్ష సభ్యులకు మంత్రి పొన్నం సూచన
- పదేండ్లలో గురుకులాలకుసొంత భవనాలు ఎందుకు కట్టలే?
- గ్రీన్ చానల్ ద్వారా అందే నిధులను కూడా బంద్ పెట్టిన్రు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకులాల్లో చదివే 8 లక్షల మంది పిల్లలకు ధైర్యం ఇచ్చేలా అసెంబ్లీలో మాట్లాడాలని ప్రతిపక్ష సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ‘‘పదేండ్లు గత బీఆర్ఎస్ సర్కారు పెట్టిన బురదను కడగడానికే ఇప్పుడు సమయం పోతున్నది. కనీసం వర్సిటీలకు వీసీలను కూడా నియమించలేదు. టీచర్లను రిక్రూట్ చేయలేదు. వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వలేదు” అని ఆయన మండిపడ్డారు.
గురుకులాలపై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి పొన్నం మాట్లాడారు. పదేండ్లలో గురుకులాలకు ఒక్క సొంత భవనం కూడా ఎందుకు కట్టలేదని బీఆర్ఎస్ను నిలదీశారు. 2014 వరకూ గ్రీన్ చానల్ ద్వారా నిధులు అందేవని, కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వాటిని ఎత్తేసిందని ఆయన అన్నారు. ఉమ్మడి ఏపీలో అన్యాయం జరిగిందనే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామనే విషయాన్ని బీఆర్ఎస్ సభ్యులు గుర్తుంచుకోవాలని సూచించారు. ‘‘మేం తెలంగాణ కోసం కొట్లాడాం. రాష్ట్రం వచ్చిన తర్వాత పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ వాళ్లు ఏం చేశారో సమాధానం చెప్పాలి?” అని ఆయన నిలదీశారు.
పొరపాట్లు ఉంటే చెప్పండి
ప్రజా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తున్నదని, ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం గురుకులాలు సందర్శించాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్టు చెప్పారు.
గురుకులాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఏం జరిగినా సహించేది లేదని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. తనతో పాటు సీఎం రేవంత్రెడ్డి, ప్రజాప్రతినిధులమంతా గురకులాలకు వెళ్లామని గుర్తుచేశారు. ఈ ఏడాది కాలంలో జరిగిన పొరపాట్లు ఉంటే చెప్పాలని, కానీ పదేండ్లలో బాగా చేసినట్టు చెప్పుకోవడం ఏమిటని బీఆర్ఎస్ను నిలదీశారు. పిల్లల్లో ధైర్యం నింపేలా, వారిని కాపాడుకునేలా సభ్యులు మాట్లాడాలని ఆయన సూచించారు.