
కొమురవెల్లి, వెలుగు : సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామిని ఆదివారం కుటుంబసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం తరవాత శాలువా కప్పి, లడ్డూ ప్రసాదం అందజేశారు.
అనంతరం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని మల్లన్నను కోరుకున్నట్లు చెప్పారు. మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీకి 600 బస్సులు వస్తున్నాయన్నారు. గ్రామాల్లో తాగు నీటిని ఇబ్బందులు ఉంటే ఆఫీసర్ల దృష్టికి తీసుకురావాలని, సమస్య పరిష్కారం కాకపోతే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీలో చట్టబద్ధం చేసి ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి మద్దతు కోరుతామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే నాగపూరి రాజలింగం, మండల అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్, నాగపూరి కిరణ్‌కుమార్, ముత్యం నర్సింహులు, రమేశ్, ధర్మకర్తలు జయ ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.