కులగణన లెక్కలపై చర్చలకు రెడీ : మంత్రి పొన్నం ప్రభాకర్

కులగణన లెక్కలపై చర్చలకు రెడీ : మంత్రి పొన్నం ప్రభాకర్
  • మంత్రి పొన్నం ప్రకటనను స్వాగతిస్తున్నం
  • బీసీ సంఘాల నేతల ప్రకటన.. నేడు రాహుల్​కు లేఖలు

హైదరాబాద్, వెలుగు: సమగ్ర కులగణన రిపోర్ట్ పై బీసీ సంఘాల నేతలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటనపై బీసీ సంఘాలు, మేధావులు హర్షం వ్యక్తం చేశారు. కులగణన రిపోర్టును పునఃసమీక్షిస్తామంటే ప్రభుత్వంతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. బీసీల జనాభాను తక్కువగా చూపించారని, జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి శుక్రవారం లేఖ రాస్తామని రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.

ఈ నెల 9న హైదరాబాద్​లో సమగ్ర కులగణన రిపోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలు.. అదేవిధంగా బీసీ సంఘాలు చెప్తున్న లెక్కలపై “ఏది నిజం” పేరుతో బీసీ ప్రజా ప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ నెల రెండో వారంలో బీసీ కులాల లెక్కలను తక్కువగా చేసి చూపించినందుకు నిరసనగా వేలాది మందితో ‘బీసీ కులగణన రణభేరి’పేరుతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని 
చేపడుతున్నట్లు నిర్ణయించామన్నారు.

 బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఈ నెల మూడో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తామని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారితో పాటు పలువురు బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.