బీసీ రిజర్వేషన్లు ఫిక్స్ అవ్వగానే లోకల్ బాడీ ఎలక్షన్స్: మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీ రిజర్వేషన్లు ఫిక్స్ అవ్వగానే లోకల్ బాడీ ఎలక్షన్స్: మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం (జనవరి 30) మంత్రి పొన్నం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. బీసీ రిజర్వేషన్‎పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేషన్ కమిషన్, మంత్రి వర్గం ఇప్పటికే చర్చించిందని.. రెండు మూడు రోజుల్లో బీసీ రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తామని తెలిపారు. 

బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవ్వగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని.. ఎవరికి భయపడే ముచ్చటే లేదన్నారు మంత్రి. ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష నేతలను పట్టించుకోదలచుకోలేదని అన్నారు.  కాగా, రాష్ట్రంలో పంచాయతీ పాలక వర్గాల కాలం ముగిసి దాదాపు ఏడాది కావస్తోన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Also Read :- క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కాకా ఫ్యామిలీ ఎల్లప్పుడూ సిద్ధం

ఇచ్చిన మాట మేరకు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం బీసీ డెడికేషన్ కమిషన్‎ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2025, ఫిబ్రవరి 2వ తేదీన కేబినెట్ సబ్ కమిటీకి బీసీ డెడికేషన్ కమిటీ రిపోర్టు అందనున్నట్లు తెలుస్తోంది. ఈ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం తెలిపితే.. వెంటనే ప్రభుత్వం స్థానిక సంస్థలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.