ఎవరు సలహాలు, సూచనలు ఇచ్చినా స్వీకరిస్తాం: మంత్రి పొన్నం

ఎవరు సలహాలు, సూచనలు ఇచ్చినా స్వీకరిస్తాం: మంత్రి పొన్నం
  • బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలి
  • కులగణనలోని తప్పులను సవరించండి
  • బీసీలను 21లక్షలు తక్కువ చూపారు
  • మంత్రి పొన్నం దృష్టికి తెచ్చిన బీసీ సంఘాల ప్రతినిధులు
  • సర్వేలో మిస్సయిన వాళ్ల కోసం స్పెషల్ ​డ్రైవ్ నిర్వహించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: కులగణన సర్వేలో బీసీల జనాభాను 21లక్షలు తక్కువగా చూపించారని, ఓసీల జనాభాను 16 లక్షలు పెంచారని, మొత్తం మీద జనాభా కూడా 34 లక్షల మేర తగ్గినట్లు తమకు అనుమానాలున్నాయని బీసీ సంఘాల నేతలు అన్నారు. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్​దృష్టికి తెచ్చారు. కులగణన సర్వే ఆన్​లైన్ చేసే టైంలోనూ తప్పులు జరిగాయని, మిస్సయిన వాళ్ల కోసం స్పెషల్​డ్రైవ్ నిర్వహించాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలని కోరారు. 

బీసీ లెక్కలను హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని విడదీసి చెప్పడం సరికాదని పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారి రాష్ట్రంలో కులగణన చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కులగణన లెక్కలపై బీసీ సంఘాల నేతల అనుమానాలను నివృత్తి చేసేందుకు శనివారం సెక్రటేరియెట్‎లో మంత్రి పొన్నం ప్రభాకర్​సుమారు 4 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీసీల లెక్కల్లో తప్పులున్నాయని, బీసీల జనాభాను సుమారు 20లక్షలకు పైగా తగ్గించి చూపారని బీసీ మేధావుల ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తదితరులు ఆరోపించారు. 

ఈ మేరకు తమ వద్ద ఉన్న ఆధారాలను మంత్రికి అందించారు. లక్షల మంది సర్వేలో పాల్గొనలేదని, అలాంటివారు వివరాలు ఇచ్చేందుకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. డేటా ఎంట్రీ టైమ్‎లో కూడా తప్పులు జరిగాయని, వాటిని సరిచేయకుండా ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వానికి తీరని నష్టం జరుగుతుందన్నారు. ఎంట్రీ చేసిన డేటాను మళ్లీ సమీక్షించాలని పేర్కొన్నారు. బతుకుదెరువు కోసం ఇతర దేశాలకు వెళ్లిన తెలంగాణ ప్రజల వివరాల నమోదుకు మొబైల్ యాప్ తీసుకురావాలని నాయకులు విజ్ఞప్తిచేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు  ఇచ్చేందుకు అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు. 

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమీక్షించేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన కమిషన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు  42 శాతం రిజర్వేషన్ల కల్పించే అంశంపై అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపాలని, పార్లమెంట్ లో ఎంపీలంతా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. కాగా, సమావేశానికి   ప్లానింగ్ డిపార్ట్ మెంట్ అధికారులెవరూ రాకపోవడంపై బీసీ సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తంచేశారు. మరో వైపు కులగణన సర్వేకు  నోడల్ ఆఫీసర్ ను నియమించకపోవడాన్నీ  తప్పుపట్టారు. 

సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి పొన్నం

రాష్ట్రంలో అట్టడుగు వర్గాలకు  న్యాయం చేసేందుకే కులగణన చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. అయినప్పటికీ కులగణనపై  ఎవరు, ఎలాంటి సలహాలు, సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామని తెలిపారు. కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ ,10 ఏండ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్..  బీసీ లను అణగదొక్కాయని మండిపడ్డారు. ‘‘వారు ఏనాడూ బీసీలకు న్యాయం చేయాలని అనుకోలేదు. ఇలాంటి కులగణన చేయలేదు. కానీ కులగణన చేసిన మా ప్రభుత్వంపై చిన్నచిన్నలోపాలను పట్టుకొని విమర్శలు  చేస్తున్నారు’’ అని పొన్నం అన్నారు. 

సమావేశంలో బీసీ సంఘాల నాయకులు ఇచ్చిన సూచనలను, సలహాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామని తెలిపారు. గ్రామాల్లో కులగణన సర్వే బాగా జరిగినప్పటికీ  హైదరాబాద్ లాంటి నగరాల్లో కొంత ఇబ్బంది ఏర్పడిందని ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. కులగణనలో కొన్ని తప్పులు జరిగాయని, వాటిని సరి చేస్తామని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు తెలిపారు. ఇంత పెద్ద పక్రియ చేపట్టినప్పుడు చిన్న చిన్న తప్పులు జరగటం సహజమన్నారు. 

సమావేశంలో ఎంపీలు సురేశ్​ షెట్కార్, ఆర్. కృష్ణయ్య, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ , కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ , బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్‌‌, తిరుమలగిరి సురేందర్‌‌, బాలలక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్‎లు నూతి శ్రీకాంత్ గౌడ్, జ్ఞానేశ్వర్, ఈరవత్రి అనిల్, మెట్టు సాయి కుమార్, జైపాల్, వినయ్ కుమార్, బీసీ మేధావులు మురళీ మనోహర్, తాడూరి శ్రీనివాస్, బాలరాజు గౌడ్, దాసు సురేష్,  శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

తప్పులు సవరించాలి: జాజుల

‘‘కులగణనపై మాకు ఉన్న సందేహాలను మంత్రి పొన్నం దృష్టికి తెచ్చాం. మొత్తం 6 అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. సర్వేలో బీసీల జనాభా 21లక్షలు తక్కువగా నమోదైంది. ఓసీల జనాభా  16లక్షల వరకు పెరిగింది. మొత్తం జనాభా 34 లక్షల వరకు తగ్గింది. ఇదే విషయాన్ని మంత్రికి వివరించాం. ఆధారాలూ అందించాం” అని మీడియాతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  అన్నారు. 

సుమారు 3.1 శాతం జనాభా సర్వేలో పాల్గొనలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ‘‘బీసీలను హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని ఎలా విభజిస్తారని అడిగాం.  బీసీలు 56శాతం అని కలిపి చెప్పకుండా వేర్వేరుగా చెప్పడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్లాయి. మా అభ్యంతరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు” అని ఆయన అన్నారు. 

సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేస్తుంది: శ్రీకాంత్ గౌడ్ 

కులగణన సర్వే ఒక సాహోసోపేతమైన నిర్ణయమని బీసీ కార్పొరేషన్ చైర్మన్​ నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. బీసీ సంఘాల ప్రతినిధులు  ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సందేహాలను కచ్చితంగా నివృత్తి చేస్తామని తెలిపారు. కులగణన విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. ఉదాహరణగా చూపుతున్న గత ప్రభుత్వ లెక్కలకు శాస్త్రీయత లేదని పేర్కొన్నారు. 

ప్రభుత్వం దృష్టికి బీసీ సంఘాలు తీసుకెళ్లిన 6 అంశాలు ఇవే.. 

1. వివిధ కారణాల వల్ల కులగణనలో పాల్గొనని లక్షలాది మంది తమ వివరాలు నమోదుచేసేందుకు స్పెషల్ డ్రైవ్ 
ఏర్పాటు చేయాలి.
2. తెలంగాణ నుంచి ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లిన వారు వివరాలు నమోదు చేసుకునేలా మొబైల్ యాప్​ను తీసుకురావాలి.
3.  సర్వేలో అవలంబించిన వివిధ పద్ధతులు అశాస్త్రీయంగా ఉన్నందున దీనిపై రివ్యూ చేయాలి.
4.  డేటా ఎంట్రీ వివరాలను కూడా పున:పరిశీలించాలి.
5. లోకల్ బాడీల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేయాలి.
6. బీసీల అవకాశాలను గండి కొడుతున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమీక్షించేందుకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కమిషన్ ను ఏర్పాటు చేయాలి.