లైట్ తీస్కోండి.. అవిశ్వాసం టెక్నికల్‎గా సాధ్యం కాదు: మంత్రి పొన్నం ప్రభాకర్

లైట్ తీస్కోండి.. అవిశ్వాసం టెక్నికల్‎గా సాధ్యం కాదు: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్‎పై అవిశ్వాస తీర్మానం టెక్నికల్‎గా సాధ్యమయ్యే అంశం కాదని.. దాన్ని పట్టించుకోవద్దని కాంగ్రెస్ కార్పొరేటర్లకు మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు సూచించారు. కౌన్సిల్ సమావేశం, మేయర్‎పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు, మేయర్ విజయలక్ష్మితో బుధవారం (జనవరి 29) హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్ బాబు మినిస్టర్ క్వార్టర్స్‎లో భేటీ అయ్యారు.

2025, జనవరి 30న జరగనున్న కౌన్సిల్ మీటింగ్‎లో అనుసరించాల్సిన వ్యూహాలు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం అంశాన్ని తీసుకొస్తే ఎలా ఎదుర్కొవాలన్న అంశంపై చర్చించారు. కౌన్సిల్‎లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్పొరేటర్లకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రేటర్‎లో జరిగిన అభివృద్ధి, కేటాయించిన నిధుల అంశాలపై కౌన్సిల్‎లో చర్చించాలని కార్పొరేటర్లకు సూచించారు. 

కౌన్సిల్‎లో కాంగ్రెస్ కార్పొరేటర్లు అంతా ఏకతాటిపై ఉండి ప్రతి పక్షాలకు కౌంటర్లు ఇవ్వాలని చెప్పారు. రేపు (గురువారం) కౌన్సిల్ భేటీ ప్రారంభానికి ముందు ఉదయం 8 గంటలకు మినిస్టర్ క్వార్టర్స్‎లోని మంత్రి పొన్నం ఇంట్లో గ్రేటర్ పరిధిలోని కాంగ్రెస్ కార్పొరేటర్లతో మరోసారి భేటీ కానున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గ్రేటర్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.