భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవర పల్లి మండలంలోని కొత్తకొండ వీర భద్రస్వామివారి ఆలయంలో మంగళవారం రోడ్డు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నక్షత్ర దీక్ష స్వీకరించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి ఆలయాన్ని దర్శించుకున్నానని, ఎమ్మెల్యేగా గెలిస్తే నక్షత్ర దీక్ష తీసుకుంటానని మొక్కుకున్నట్లు తెలిపారు.
దేవుడు ఆశీర్వదించి మంత్రిని కూడా చేశాడు కాబట్టి, నక్షత్ర దీక్ష తీసుకున్నానని, దీక్ష 27 రోజులు పాటు కొనసాగుతుందన్నారు. అప్పటి వరకు మంత్రి ఆలయంలో అన్నదానం చేయనున్నారు. ఈవో కిషన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్లా విజయ్.. గంగా, యమున, సరస్వతీ నదుల నుంచి తీసుకొచ్చిన నీటితో తయారు చేసిన చీరను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. విజయ్ మాట్లాడుతూ మూడు నదుల నుంచి తీసుకువచ్చిన నీళ్లలో చీర దారాలను నానబెట్టి తయారు చేసినట్టు చెప్పారు.