![బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీజేపీ అనుకూలమా.. వ్యతిరేకమా..?: మంత్రి పొన్నం](https://static.v6velugu.com/uploads/2025/02/minister-ponnam-prabhakar-on-bjp-stand-on-reservation-for-backward-classes_B4OaV8SHko.jpg)
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీజేపీ అనుకూలమా.. వ్యతిరేకమా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. రాజకీయ, విద్య, ఉపాధి అవకాశాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం క్యాబినెట్ తీర్మానంతో పాటు శాసనసభలో చట్టం తీసుకొస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన పొన్నం.. రిజర్వేషన్లకు అనుకూలమో, వ్యతిరేకమో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తాము 100% సర్వే జరిగిందని చెప్పలేదని, 3.1 % మిగిలి ఉందని, మొత్తం మూడు లక్షల 54 వేల ఇల్లు మిగిలిపోయాయని చెప్పామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి శుక్రవారం (ఫిబ్రవరి 14) కాంగ్రెస్ శ్రేణుల సమావేశంలో మాట్లాడిన అంశం.. ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదని, ఆయన కులం 1994లో చరణ్ దాసు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారిందా, లేదా మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్చుకున్నారా అనే అంశాన్ని పక్కన పెడితే.. ఒకప్పుడు మోదీ బీసీగా కన్వర్ట్ అయ్యారని తెలిపారు.
కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటెల రాజేందర్ సహా మిగతా నాయకులు.. ప్రధానమంత్రి కులానికి సంబంధించిన ప్రస్తావన తెచ్చి తెలంగాణ బలహీన వర్గాలకు అన్యాయం చేసే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం సర్వేలో మిగిలిన వారికి 16 వ తేది నుండి 28 తేదీ వరకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. సర్వేలో పాల్గొనని వారిని చైతన్యపరిచి తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండాలని చెప్పాలని, అంతేకాని రాజకీయాలు చేయడం తగదని అన్నారు.
రిజర్వేషన్లపై శాసన సభలో తీర్మానం చేస్తామని..ఈ ప్రతిపాదనపై ప్రధానమంత్రిని ఒప్పిస్తారా లేదా అని ప్రశ్నించారు. సహకరించకపోతే ప్రధాని కూడా విమర్శించాల్సి వస్తుందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం అన్నారు.