గురుకుల స్టూడెంట్స్ కు వైద్య పరీక్షలు అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ​ఆదేశం

గురుకుల స్టూడెంట్స్ కు వైద్య పరీక్షలు అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ​ఆదేశం
  • జగిత్యాల లాంటి ఘటన రిపీట్ కాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి
  • పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీ , ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని  అధికారులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గురుకుల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రిన్సిపాల్స్​జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి గురుకుల పాఠశాలలో వాటర్ ట్యాంకులు శుభ్రం చేయాలని, తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని,  పిల్లలకు అస్వస్థతగా ఉంటే ఏఎన్ఎం పర్యవేక్షణలో చికిత్స అందించాలని  పొన్నం ఆదేశించారు. పిల్లల హైట్,  వెయిట్ రికార్డు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన మంచి పోషకాహారం అందించాలని, వంటలు వండేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

పరిసరాలు, తరగతి గది, హాస్టల్ గది శుభ్రతపై పిల్లలకు అవగాహన కల్పించాలని, వారికి హిమోగ్లోబిన్, విటమిన్ -డి లాంటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.  ఇటీవల జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దపూర్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో జరిగిన ఘటనలలాంటివి ఎక్కడా పునరావృతం కాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.