నమ్మించి తీసుకెళ్లి కలెక్టర్‌పై దాడి.. ఇంత జరిగినా చూస్తూఊరుకోవాల్నా?: పొన్నం

  • ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలాగా బీఆర్ఎస్,బీజేపీ వ్యవహారం ఉందని కామెంట్ 
  • కరీంనగర్ కలెక్టరేట్​లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం 

కరీంనగర్, వెలుగు: ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్​ను ఓ వ్యక్తి నమ్మించి వేరే ప్రాంతాని కి తీసుకెళ్లాడని, అక్కడ కలెక్టర్​పై దాడి చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ‘‘నిన్న ఐఏఎస్​లకు రక్షణ లేదని అన్నవారే.. ఈ రోజు ట్రోల్ చేస్తూ రైతుల ఇష్యూ ముందుకు తీసుకొస్తున్నారు. కలెక్టర్ మీద దాడి జరిగి నా ఊరుకోవాల్నా? మల్లన్నసాగర్ భూనిర్వాసితుల మీద దాడి చేసిందెవరో అందరికీ తెలుసు.. అవి మర్చిపోయారా?” అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. 

మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్​లో ఇందిరా మహి ళా శక్తి క్యాంటీన్ ను పొన్నం ప్రారంభించారు.  అనంతరం మీడియాతో మాట్లాడారు. నిరసనలు తెలపడానికి అనేక పద్ధతులు ఉన్నాయని, దాడి చేయడం సరికాదని పొన్నం అన్నారు. అన్యాయం జరిగితే పోరాడేందుకు కోర్టులు ఉన్నాయని తెలిపారు. సిరిసిల్లలో యార్న్ బ్యాంక్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి కృషి చేస్తున్నట్టు చెప్పారు.  

సర్వేను అడ్డుకుంటే ఊకోం.. 

కులగణన సర్వేలో ఎన్యుమరేటర్లను బీఆర్ఎస్, బీజేపీ వాళ్లే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం అన్నారు. విధుల్లో ఉన్నవారిని రాజకీయ కుట్ర దారులు ఇబ్బంది పెడితే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. మనిషి అనారోగ్యానికి గురైనప్పుడు ఎక్స్​రే ఎలా ఉపయోగపడుతుందో.. ఈ సర్వే కూడా అలాగే ఉపయోగపడుతుందని చెప్పారు. ‘‘బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలాగా వ్యవహరిస్తున్నారు. తన మీద వస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. అలా కాకపోతే తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని కేటీఆర్ నిరూపించుకోవాలి” అని సవాల్ విసిరారు. 

‘‘ప్రభుత్వానికి బకాయిలు లేని రైస్ మిల్లర్ల విషయంలో ఇబ్బందులు లేవు. డిఫాల్టర్లు రూ.20 వేల కోట్ల బకాయిలు ఉన్నారు. పైగా ఆ మిల్లర్లే ప్రభుత్వం తమను బద్నాం చేస్తోందని అంటున్నారు. ఇకపై డిఫాల్టర్లను ఉపేక్షించేది లేదు. వారిని పక్కన పెట్టి బకాయిలు లేని మిల్లర్లకు ధాన్యం కేటాయిస్తున్నాం” అని పేర్కొన్నారు. పత్తి కొనుగోళ్ల విషయంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఇద్దరు కేంద్రమంత్రులదే బాధ్యత అని అన్నారు.