కోహెడ(హుస్నాబాద్), వెలుగు: దేశ తొలి ఉపాధ్యాయురాలు, మహిళా విద్యకు కృషి చేసిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్,అక్కన్నపేటలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, సింగిల్విండో చైర్మన్శివ్వయ్య, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఆర్డీవో రామ్మూర్తి ఉన్నారు.
సమన్వయంతో పని చేయాలి
కార్యకర్తలందరూ సమన్వయంతో పని చేస్తూ పార్టీని బలోపేతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్సూచించారు. శుక్రవారం అక్కన్నపేట మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో ఊరూరా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఆదేశించారు. గౌరవెల్లి కాల్వల నిర్మాణానికి నిధులు కేటాయించామని, భూములు కోల్పోతున్న రైతులు పెద్ద మనసుతో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కాల్వాల నిర్మాణమైతేనే ఊరూరా సాగు నీరు వస్తాయని రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు.