పదేండ్లలో మీరేం చేశారు .. కాంగ్రెస్, మోదీ గ్యారంటీలపై చర్చకు సిద్ధమా : పొన్నం

  • కిషన్ రెడ్డి తన పేరును కిస్మత్​రెడ్డిగా మార్చుకోవాలని విమర్శ 

హైదరాబాద్, వెలుగు: పదేండ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు ఏం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రశ్నించారు. కాంగ్రెస్, మోదీ గ్యారంటీలపై చర్చకు సిద్ధమా? అని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ఆదివారం బీజేపీ విడుదల చేసిన చార్జ్ షీట్ కు కౌంటర్ గా పొన్నం ప్రకటన విడుదల చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ‘మోదీ గ్యారంటీ’ పేరుతో బీజేపీ ప్రజలను మోసం చేసిందని, ఆ గ్యారంటీలు ఇప్పటి వరకు అమలు కాలేదని మండిపడ్డారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన పేరును కిస్మత్ రెడ్డిగా మార్చుకోవాలని విమర్శించారు. ‘‘కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు కాదు. అంబర్ పేట్ నియోజకవర్గానికే అధ్యక్షుడు. ఈ మాట బీజేపీ నాయకులే అంటున్నారు. కిషన్ రెడ్డి ఎంపీకి ఎక్కువ, కేంద్రమంత్రికి తక్కువ” అని కామెంట్ చేశారు.  

కిషన్ రెడ్డి.. ముందు నిధులు తీస్కరా

కిషన్ రెడ్డి ముందు రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకొచ్చి మాట్లాడాలని పొన్నం ప్రభాకర్​ అన్నారు. హైదరాబాద్​లో వరదలతో వేల కోట్ల నష్టం జరిగితే కేంద్రం కేవలం రూ.400 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ఎవరిని అడిగినా చెబుతారన్నారు. మోదీ ఇస్తానన్న ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, రైతులకు పెన్షన్లు, రైతుల ఆదా యం రెట్టింపు హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 

బీజేపీ దేశవ్యాప్తంగా 400 మంది ఎమ్మెల్యేలను వివిధ పార్టీల నుంచి చేర్చుకుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఫైర్ అయ్యారు. కాగా, హైదరాబాద్ లోని సంజీవయ్య పార్క్ లో గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీకమాస వనభోజనాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.