జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి సరికాదు.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటం: మంత్రి పొన్నం

హైదరాబాద్: కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై ప్రముఖ నటుడు మోహన్ బాబు దాడి చేసిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు టాలీవుడ్‎లో ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. జర్నలిస్టుల పట్ల అహంకార పూరితంగా వ్యవహరించిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. 

ఈ మేరకు బుధవారం (డిసెంబర్ 11) ఆయన ఒక వీడియో విడుదల చేశారు.మోహన్ బాబు, మంచు మనోజ్ వ్యక్తిగత పంచాయతీలో  జర్నలిస్టుపై దాడి సరికాదని అన్నారు. దాడి ఘటనపై విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా, మంచు ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు గత నాలుగు రోజులుగా పీక్ స్టేజ్‎కు చేరాయి.  

మంగళవారం (డిసెంబర్ 10) రాత్రి జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసానికి ఆయన కుమారుడు మంచు మనోజ్ వెళ్లడంతో ఉద్రిక్తలు మరింత ఎక్కువ అయ్యాయి. మనోజ్ ను ఇంట్లోకి రానివ్వకుండా గేట్స్ క్లోజ్ చేసి అడ్డుకున్నారు మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మనోజ్ గేట్లు తోసుకుని ఇంటి లోపలికి వెళ్లాడు. మోహన్ బాబు ఇంటి వద్ద జరుగుతోన్న ఈ ఫ్యామిలీ ఫైట్‎ను కవరేజ్ చేసేందుకు మీడియా అక్కడికి వెళ్లింది. 

ALSO READ | మంచు ఫ్యామిలీ ఇష్యూ: రాచకొండ సీపీ కార్యాలయానికి మంచు విష్ణు

మీడియా ప్రతినిధులు ఇంట్లోకి రావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మోహన్ బాబు.. కోపంలో జర్నలిస్టుపై దాడి చేశాడు. జర్నలిస్టు చేతిలో ఉన్న మైక్ ను తీసుకుని తలపై కొట్టాడు. ఈ ఘటనలో జర్నలిస్టు తీవ్రంగా గాయపడ్డాడు.  అహంకార ధోరణితో జర్నలిస్ట్ పై దాడి చేసిన మోహన్ బాబుపై జర్నలిస్టు సంఘాలు భగ్గుమన్నాయి. మోహన్ బాబు మీడియాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బుధవారం (డిసెంబర్ 11) ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ఆందోళన చేశారు.