కరీంనగర్: కలెక్టర్‌పై దాడి చేయడం ప్రజాస్వామ్యామా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై జరిగిన దాడిపై మంత్రి రియాక్ట్ అయ్యారు. మంగళవారం (నవంబర్ 12) కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడి చేయడం చాలా బాధకరమని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన కలెక్టర్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కావాలనే కలెక్టర్‌ని తప్పుదోవ పట్టించి పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారని ఆరోపించారు. కలెక్టర్‌పై దాడి చేయడం ప్రజాస్వామ్యామా అని ప్రతిపక్షాలను నిలదీశారు.
ప్రజాస్వామ్య పద్దతిలో న్యాయవ్యవస్థ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని.. అంతేకానీ అధికారులపై భౌతిక దాడులకు దిగడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకి వచ్చిన అధికారులకి సమాచార సేకరణలో అడ్డంకులు సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమగ్ర కుటుంబ సర్వేపై కావాలనే బీఆర్ఎస్, బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేలో అభ్యంతకర అంశాలు ఉంటే ప్రభుత్వానికి చెప్పండని సూచించారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ప్రతిపక్షాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం వారి బాధ్యత అని గుర్తు చేశారు. కేటీఆర్ సిరిసిల్ల నేతన్నల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. సిరిసిల్లలో దంపతుల ఆత్మహత్యకి భీమండిలో వారు చేసిన అప్పులతో పాటు ఇల్లు కట్టుకోవడం వల్ల జరిగిన అప్పులు కారణమని మా దృష్టికి వచ్చిందని తెలిపారు. నేతన్నలు ఎవరూ అధైర్యపడవద్దని.. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.