కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నడు .. మీడియాతో చిట్‌‌చాట్‌‌లో మంత్రి పొన్నం ప్రభాకర్

కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నడు .. మీడియాతో చిట్‌‌చాట్‌‌లో మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు : బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని, ఇందుకోసం బీఆర్ఎస్ సహా ప్రతిపక్షాలన్నీ కలిసిరావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బుధవారం సెక్రటేరియెట్ లో మీడియాతో ఆయన చిట్‌‌చాట్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు వాస్తవాలు మాట్లాడుతుంటే, అవి జీర్ణించుకోలేని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌‌ అసహనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘కేసీఆర్‌‌కు ప్రజాస్వామ్యమంటే విలువ లేదు. ఆయన వ్యాఖ్యల్లో అసహనం తప్ప మరొకటి కనిపించడం లేదు. అధికారానికి దూరమవడంతో కేసీఆర్‌‌లో అసహనం ఎక్కువైంది. గత పాలకుల కారణంగా రాష్ట్రం అప్పులపాలైనా, ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తున్నాం. 

పాత పథకాలనూ కొనసాగిస్తున్నాం. కేంద్రం సహకరిస్తే, మరింత అభివృద్ధి చేస్తాం” అని తెలిపారు. పదేండ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీకి వెళ్తాం. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ మాతో కలసి రావాలి. కులగణనపై ఆనాడు విజ్ఞప్తి చేసినోళ్లు, విమర్శలు చేసినోళ్లు.. మిస్ అయినోళ్లందరూ ఇప్పుడు సర్వేలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు కూడా సర్వేలో పాల్గొనాలి” అని అన్నారు.

కులగణనలో పాల్గొననోళ్లు వివరాలివ్వండి

కులగణన సర్వేలో వివరాలు ఇవ్వని వారు ఈ నెల 28వ తేదీ వరకు నిర్వహించే రీ సర్వేలో ఎన్​రోల్ చేసుకోవాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. మేధావులు, బలహీన వర్గాల నాయకులు, ఫ్రొఫెసర్లు వివిధ స్థాయిల్లో ఉన్న అందరి విజ్ఞప్తి మేరకు కులగణనలో నమోదు చేసుకోని వారికి మరో అవకాశం ఇచ్చామని మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. 3 పద్ధతుల్లో కుల సర్వేలో సమాచారం ఇవ్వడానికి అవకాశం కల్పించామని పేర్కొన్నారు. సర్వేలో నమోదు చేసుకోని వారు, సమాచారం ఇవ్వనివారు వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

 కుల సర్వేకి ఆనాడు విజ్ఞప్తి చేసిన వారు, విమర్శలు చేసిన వారు ఇప్పుడు మిస్ అయిన వారందరినీ మోటివేట్ చేసి సర్వేలో భాగస్వామ్యులు అయ్యేవిధంగా చూడాలని తెలంగాణ మేధావులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు.. సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన, బలహీన వర్గాల పక్షాన సానుకూలంగా ఉన్నామని చెప్తూ నిర్ణయం తీసుకోవాలన్నారు. కులగణనలో పాల్గొనకుండా విమర్శలకే పరిమితమైతే బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. సర్వేలో పాల్గొని వివరాలిస్తే జనాభా లెక్కల్లో భాగస్వాములు అవుతారని పొన్నం తెలిపారు.