![బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నం : పొన్నం ప్రభాకర్](https://static.v6velugu.com/uploads/2025/02/minister-ponnam-prabhakar-said-42-percent-reservation-will-be-provided-to-bc-in-local-bodies_gdI8pPHlx0.jpg)
- సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే హక్కు లేదు
- కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు కులగణన సర్వే ఫారాలు పోస్ట్ చేసిన మంత్రి
కరీంనగర్, వెలుగు: బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ఇచ్చిన హామీకి తాము కట్టుబడి ఉన్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీల లెక్కలపై తప్పుడు సంకేతాలు వెళ్లేలా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రవర్తిస్తున్నాయని, ఆ రెండు పార్టీలకు కుల గణనపై మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. రీసర్వే చేస్తే కేసీఆర్‌తో సహా తాను కూడా కులగణన సర్వేలో పాల్గొంటానని ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. సర్వేలో పాల్గొనని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కు సర్వే ఫారాలను పోస్ట్ చేస్తున్నానని వెల్లడించారు.
ఈ ఫారాలను నింపి పంపాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని పొన్నం కాంప్లెక్స్ లో మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కుల గణన సర్వే చేశామని తెలిపారు. ఇప్పుడైనా వివరాలు ఇస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుకు మాట్లాడే అవకాశం ఉంటుందని అన్నారు. బీసీల్లో ముస్లిం మైనారిటీ అనేది ఇప్పుడు కొత్త కాదని, గ్రామాల్లో దూదేకుల లాంటి వారు ఎప్పటి నుంచో బీసీల్లోనే ఉన్నారని గుర్తుచేశారు. ప్రగతిశీల భావాలు కలిగిన తాను సోమవారం నామినేషన్ సందర్భంగా ఎర్ర చొక్కా వేసుకున్నానని, అది చూసి నామినేషన్ కు అర్బన్ నక్సల్స్ వచ్చారనడం సరికాదన్నారు.