సమగ్ర సర్వేకు ప్రజలంతా సహకరించాలి :  మంత్రి పొన్నం ప్రభాకర్ 

సమగ్ర సర్వేకు ప్రజలంతా సహకరించాలి :  మంత్రి పొన్నం ప్రభాకర్ 

కొండగట్టు,వెలుగు :  సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలంతా సహకరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఉదయం   కొండగట్టు అంజన్నను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి  పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వేపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు.

సమాచార సేకరణ ద్వారా భవిష్యత్తులో సంక్షేమ, అభివృద్ధి పథకాలు పక్కాగా అమలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.  రాష్ట్రంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కొండగట్టు ఆంజనేయస్వామిని కోరుకున్నట్లు తెలిపారు. కొండగట్టులో ప్రతి పౌర్ణమి సందర్భంగా చేపడుతున్న గిరి ప్రదక్షణ రహదారి నిర్మాణం కోసం రెండు లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీవన్ రెడ్డి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, ముత్యం శంకర్, గాజుల అజయ్ తదితరులు పాల్గొన్నారు.