- బీఆర్ఎస్, బీజేపీ.. తానా అంటే తందానా అంటున్నయ్: పొన్నం
- మూసీ నిర్వాసితులను ఆదుకుంటం
- పునరావాసం కల్పించాకే ఆక్రమణలు తొలగిస్తామని మంత్రి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులను అన్నివిధాలా ఆదుకుంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. నిర్వాసితులకు ఏ కష్టమొచ్చినా చెప్పుకునేందుకు మంత్రులమంతా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. శుక్రవారంసెక్రటేరియెట్ మీడియాపాయింట్‌వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ‘మూసీకి వరదలు వచ్చి హైదరాబాద్ మునిగితే గత బీఆర్ఎస్సర్కారు ఇంటికి పదివేలు ఇచ్చి చేతులు దులుపుకున్నది.
కానీ, మేం వాళ్లకు శాశ్వత పరిష్కారం చూపుతున్నం. నిర్వాసితుల ఇండ్లపైకి జేసీబీలు పంపించి.. రోడ్లపై పడేయడం లేదు. ముందుగా సర్వే చేసి, వారిని డబుల్ బెడ్రూం ఇండ్లకు పంపించిన తర్వాతే కూల్చివేతలు చేపడ్తం’ అని తెలిపారు. మూసీ వెంట ప్రస్తుతం రివర్ బెడ్ పరిధిలోని నివాసాల సర్వే మార్కింగ్ మాత్రమే జరుగుతున్నదని, తాము ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్న ఇండ్ల జోలికి వెళ్లడం లేదని చెప్పారు. రివర్‌బెడ్‌లో నిర్మించినవి అక్రమ కట్టడాలు అయినప్పటికీ ఇండ్లను కోల్పోయిన వారందరికీ పునరావాసం కల్పిస్తామని మంత్రి చెప్పారు.
ప్రతిపక్షాలు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి
మూసీ ప్రక్షాళనపై ఒళ్లు, నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ప్రతిపక్షాలను మంత్రి పొన్నం ప్రభాకర్హెచ్చరించారు. వాస్తవ విరుద్ధంగా విమర్శలు చేస్తే పర్యవసానం తప్పదని అన్నారు. ఈ విషయంలో బీజేపీ,- బీఆర్ఎస్.. తానా అంటే తందానా అంటున్నాయని ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉంటే ఒకలా.. అధికారం కోల్పోతే మరోలా మాట్లాడబోమని చెప్పారు. మూసీ ప్రక్షాళనపై పగటి వేషగాళ్ల (ప్రతిపక్షాలు) మాటలను పట్టించుకోవద్దని హైదరాబాద్ ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తే.. గత ప్రభుత్వం రూ.7,380 కోట్లకు అమ్ముకున్నదని మండిపడ్డారు. గతంలో హైదరాబాద్‌లో భారీ వర్షాలు వస్తే బీఆర్ఎస్ కార్యకర్తలకు రూ. 10వేల చొప్పున పంచి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. పదేండ్లు అధికారంలో ఉన్నా 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ అట్లనే ఉన్నాయని, వాటిని ఎందుకు క్లియర్ చేయలేదని నిలదీశారు. పాతబస్తీలో మెట్రోరైలు నిర్మాణాన్ని కూడా అడ్డుకున్నారని విమర్శించారు. మూసీకి ప్రతి ఏటా రూ. వెయ్యి కోట్లు అని చెప్పి.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్‌పై పెట్టిన ఖర్చు వివరాలపై చర్చకు రావాలంటూ మాజీ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
మూసీ వెంట ఉన్న జనాలకు 10 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తున్నట్టు మాజీ మంత్రి కేటీఆర్ ఎందుకు ప్రకటించారో చెప్పాలని డిమాండ్ చేశారు. వాటిని తాము నిర్వాసితులకు ఇచ్చి చూపిస్తున్నామన్నారు. మూసీలో ఇండ్లు కోల్పోయిన వారందరికీ పునరావాసం కల్పిస్తామని చెప్పారు. హైదరాబాద్ లో నాలాలపై 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని, వాటన్నింటినీ నిర్ధాక్షిణ్యంగా కూలగొడ్తామని నాడు సీఎం హోదాలో కేసీఆర్ అన్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి నీళ్లు ఒక్క టీఎంసీ అయినా తెచ్చారా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు.
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వారిపై చర్యలు
హైదరాబాద్ లో శాంతి భద్రతలు దెబ్బతిన్నట్టు, ప్రభుత్వ కార్యక్రమాలు ఆదిలోనే విఫలమవుతున్నట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఫైర్అయ్యారు. పరిపాలనలో లోపాలు ఉంటే సెక్రటేరియెట్కుగానీ, మంత్రుల కార్యాలయాలకుగానీ వెళ్లి కలవవచ్చునని చెప్పారు. కానీ సోషల్ మీడియా ద్వారా కొందరు జనాలను రెచ్చగొడుతున్నారని, ఆందోళనలు, అల్లర్లు సృష్టించేలా పోస్టులు పెడ్తున్నారని, అలాంటివాళ్లపై సిటీ పోలీస్ కమిషనర్ కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని చెప్పారు. మీడియా సమావేశంలో ఎంపీలు రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్‌యాదవ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, పీసీసీ మీడియా కమిటీ చైర్మన్సామ రామ్మోహన్‌రెడ్డి, తదితరులున్నారు.