- మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ,వెలుగు: మత్స్య సహకార సంఘాలకే పరిమితం కాకుండా ప్రతి చెరువులో చేప పిల్లలను పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం కలెక్టర్ మనుచౌదరితో కలిసి మండలంలోని శనిగరం ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ..మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి కులవృత్తి మారాలని సూచించారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి కుల వృత్తి ఎంతో దోహదపడుతుందన్నారు.
ప్రభుత్వం బలహీన వర్గాలకు మరింత న్యాయం చేయాలని గతానికి మించి చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామన్నారు. చేపలు అమ్ముకోవడానికి మొబైల్ మార్కెట్లు, మౌలిక వసతులను ఏర్పాటు చేస్తామన్నారు. శనిగరం రాజీవ్ రహదారి పక్కన ప్రభుత్వ స్థలంలో ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని అందుకు స్థల సేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. మత్స్య సంపద, పశు పోషణ, కోళ్ల పెంపకంపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు.
లోన్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకర్లతో మాట్లాడుతామన్నారు. మత్స్యశాఖ ఏడీ శంకర్రాథోడ్,ఈఎన్సీ శంకర్, గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, హరికృష్ణ, నాయకులు ధర్మయ్య,సుధాకర్, బాలకిషన్, వెంకటస్వామి, తిరుపతిరెడ్డి, జయరాజ్, జగన్రెడ్డి, శ్రీధర్,రవి ఉన్నారు.