గురుకుల డిగ్రీకాలేజీల్లో డిమాండ్​ కోర్సులు

  • ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తం: మంత్రి పొన్నం
  •     ఫస్టియర్ నుంచే పోటీ పరీక్షలకు శిక్షణ
  •     మార్కెట్​లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఫ్రీగా ఎడ్యుకేషన్
  •     ఎడ్యుకేషన్ టూర్లు ఉంటాయని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : ఇంటర్ పూర్తి చేసిన తమ పిల్లలను గురుకుల డిగ్రీ కాలేజీల్లో చేర్పించాలని పేరెంట్స్​ను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేలా బీసీ స్టూడెంట్స్ కోసం డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. గురుకుల డిగ్రీ కాలేజీల్లో చేర్పించి భవిష్యత్​కు బంగారు బాటలు వేసుకోవాలని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ‘‘రాష్ట్రంలో 29 డిగ్రీ గురుకుల కాలేజీలు ఉన్నాయి. వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కోర్సులు అందిస్తున్నం. విద్యతో పాటు ఉన్న ఉద్యోగాలకు అవసరమైన ట్రైనింగ్​ను డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే ఇస్తున్నం. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంతాల బీసీ స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకోవాలి. ఇంటర్ పూర్తి చేసిన స్టూడెంట్స్​ను గురుకుల డిగ్రీ కాలేజీల్లో చేర్పిస్తే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటది. గురుకుల కాలేజీల్లో రెగ్యులర్ కోర్సులతో పాటు ప్రస్తుతం మార్కెట్​లో ఎంతో డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి కోర్సులు ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తి చేస్తే.. కార్పొరేట్ రంగాల్లో ఉద్యోగాలు వస్తయ్. ఫస్ట్ ఇయర్ నుంచే సివిల్స్, గ్రూప్స్, వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నం. పీజీ ఎంట్రెన్స్, ఉన్నత ఉద్యోగాలకు అవసరమైన కెరీర్ గైడెన్స్ అందిస్తున్నాం’’అని తెలిపారు. 

ప్లేస్​మెంట్స్ అవకాశాలు కల్పిస్తాం

గురుకుల డిగ్రీ కాలేజీల్లో కంప్యూటర్ పరిజ్ఞానం అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. స్కిల్ డెవలప్​మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ.. ప్లేస్​మెంట్స్ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ‘‘రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్, సీసీఎంబీ, ఐఐసీటీ మొదలైన ప్రీమియర్ ఇన్​స్టిట్యూషన్స్​లు సందర్శించేలా ఎడ్యుకేషనల్ టూర్లు ఏర్పాటు చేస్తున్నాం. సాఫ్ట్​వేర్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు.. బీసీ గురుకుల డిగ్రీ విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందిస్తున్నం. ఫ్రీగా వసతి, భోజన సదుపాయాలు అందిస్తూ.. పుస్తకాలు, నోట్​బుక్స్, యూనిఫామ్ ఇస్తున్నాం’’అని పేర్కొన్నారు. 

9,120 సీట్ల భర్తీకి చర్యలు

29 కాలేజీల్లో.. బాలుర కోసం 14 కాలేజీలు, బాలికల కోసం 15 కాలేజీలు ఉన్నాయని మంత్రి పొన్నం తెలిపారు. ‘‘మొత్తం 31 కోర్సులు అందుబాటులో ఉన్నయ్. ఫస్ట్ ఇయర్​లో 9,120 సీట్లకు ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ప్రకారం భర్తీ చేస్తున్నం. ఇప్పటికే రెండు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించాం. మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నం. ఏ జిల్లా విద్యార్థులు.. అదే జిల్లాలోని కాలేజీల్లో చేరొచ్చు. 339 మంది రెగ్యులర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లను ప్రభుత్వం నియమించింది. అడ్వెంచర్ క్యాంపులను నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్న స్టూడెంట్స్.. వివిధ స్థాయిల్లో రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ లో శిక్షణ ఇస్తున్నాం’’అని పేర్కొన్నారు. గురుకుల కాలేజీల్లో చదివిన కొంత మంది స్టూడెంట్స్ ఆర్మీ, నేవీ విభాగాల్లో ఉద్యోగాలు సాధించారని తెలిపారు. సెయిలింగ్, రెగట్టా పోటీల్లో జాతీయ స్థాయి ఛాంపియన్లుగా నిలిచారని వివరించారు. ఆర్మీ, నేవీలో స్పోర్ట్స్ కోటాలో జాబ్​కు సెలెక్ట్ అయ్యారని పేర్కొన్నారు.