కెమికల్ ఫుడ్​తో రోగాలు పెరుగుతున్నయ్​: పొన్నం

కెమికల్ ఫుడ్​తో రోగాలు పెరుగుతున్నయ్​: పొన్నం
  •     హెల్త్ కాన్ క్లేవ్​లో మంత్రి పొన్నం
  •     సర్కార్ దవాఖాన్లలో సౌలత్​లు పెంచుతున్నమని వెల్లడి

హైదరాబాద్ ,వెలుగు :   కెమికల్స్, అధిక పెస్టిసైడ్స్ వేసి పండించిన కూరగాయలు తినటంతో రోగాలు పెరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గరకు వస్తున్న సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీలు అందులో ఉన్న రోగాల వివరాలు చూస్తే భయమైతుందన్నారు. 30 ఏండ్ల లోపే డయాబెటిస్, గుండె పోటు, కిడ్ని ఫెయిల్యూర్ వంటి రోగాలు రావటం చాలా బాధగా ఉందన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో జరిగిన హెల్త్ కాన్ క్లేవ్ లో మంత్రి పాల్గొని మాట్లాడారు. వికారాబాద్ దగ్గర ఆ కాలంలో చెస్ట్ హాస్పిటల్ ఉండేదని, నిజాం నవాబు ఔషద మొక్కలు పెట్టారని.. ఎలాంటి మందులు వాడకుండా అక్కడ ఉన్న గాలి వల్ల రోగాలు మాయం అవుతాయని చెప్పేదని మంత్రి గుర్తు చేశారు. వాతావారణ కాలుష్యంతో మరిన్ని రోగాలు వస్తున్నాయన్నారు. హెల్త్ లో దేశంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మంచి స్థానంలో ఉన్నదని మంత్రి గుర్తు చేశారు. 

ఇతర దేశాల్లో ఇండియాలో తయారైన మందులు, మనదేశ కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లకు ఎక్కువ ఆదరణ ఉందన్నారు. కరోనాతో ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చిందని, ఆహారపు అలవాట్లు మారాయని, వాకింగ్, యోగాపై ఎక్కువ దృష్టి పెట్టారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సిటీ శివారులో మెడికల్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, ఇది పూర్తయ్యాక హెల్త్ లో తెలంగాణ టాప్ ప్లేస్ కు వెళ్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సిటీలో మూడు టిమ్స్, వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. సర్కార్ హాస్పిటల్స్ లో సౌలత్​లు మెరుగుపరుస్తున్నామని చెప్పారు.