కోహెడ, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కేటాయిస్తామని, ఇందులో ఎవరి జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడలో గురువారం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. సంక్రాంతికి రైతు భరోసా వస్తుందని, త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు. ఏడాదిలో చేసిన పనులన్నింటినీ ప్రజలకు వివరించాలని, స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
అనంతరం అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర్‌రావుతో ఫోన్‌లో మాట్లాడించారు. రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే రూ.30 వేల కోట్లు కేటాయించామని, రైతు భరోసా కేబినెట్ సబ్‌కమిటీలో నిర్ణయం తీసుకుంటామని తుమ్మల చెప్పారు. హుస్నాబాద్, కోహెడ, సైదాపూర్ అగ్రికల్చ్ మార్కెట్ కమిటీల ప్రమాణస్వీకారానికి హాజరువుతానని హామీ ఇచ్చారు. సమావేశంలో మండల అధ్యక్షుడు ధర్మయ్య, ఏఎంసీ చైర్‌పర్సన్ నిర్మల, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, నాయకులు జయరాజ్, సుధాకర్, సంజీవరెడ్డి, రాజయ్య, రవీందర్, మల్లారెడ్డి, కొమురయ్య పాల్గొన్నారు.