ఎట్టి పరిస్థితులోనూ దరఖాస్తులను తిరస్కరించకూడదు : మంత్రి పొన్నం

ప్రజల నుంచి వచ్చే అన్ని దరఖాస్తులను స్వీకరించాలని, ఎట్టి పరిస్థితులోనూ అధికారులు తిరస్కరించకూడదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. లబ్ధిదారుల అర్హత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం.. వారి ఆశయాలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని ఆదేశించారు.  కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులకు ప్రజాపాలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు.

ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా, ఆరోగ్యశ్రీ చికిత్స రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. ఆరు గ్యారెంటీల్లో మరో నాలుగు గ్యారెంటీలు అమలు చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మొక్కుబడిగా కాకుండా.. అధికారుల్లోనూ మార్పు వచ్చిందని ప్రజలు భావించేలా పని చేయాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా పోలీసులు ఫ్రెండ్లీగా వ్యవహరించాలని ఆదేశించారు. 

దరఖాస్తులు స్వీకరణలో తగిన జాగ్రత్తలు వ్యవహరించకపోతే మధ్య దళారులు తయారవుతారని హెచ్చరించారు మంత్రి శ్రీధర్ బాబు. త్వరలో సిటిజన్ చార్టర్ ఏర్పాటు చేసి.. జవాబుదారీతనంతో విధులు అందించేందుకు యూనియన్ నాయకులతో మాట్లాడుతున్నామన్నారు. పదేళ్ల తర్వాత దరఖాస్తు చేసుకొనే అవకాశం వచ్చిన దృష్ట్యా.. పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.