- జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీలో విదేశీ మద్యం దొరికింది: మంత్రి పొన్నం
- ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే ఊరుకోబోమని ఫైర్
హైదరాబాద్, వెలుగు: స్థానికుల ఫిర్యాదుతోనే జన్వాడ ఫామ్ హౌస్‌పై పోలీసులు దాడులు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారీగా విదేశీ మద్యం దొరికిందని తెలిపారు. ఒకరు డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని చెప్పారు. ఇంత జరిగినా.. తాము చేసింది తప్పేం కాదంటూ బీఆర్ఎస్ లీడర్లు బుకాయించడం కరెక్ట్ కాదని ఆదివారం రిలీజ్ చేసిన ప్రకటనలో మండిపడ్డారు. చేసిన తప్పు ఒప్పుకుంటే బాగుంటదని సూచించారు.
ఈ వ్యవహారంలో పోలీసులు, ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ‘‘ఈ వ్యవహారంలో సీఎం, మంత్రుల పాత్ర ఉందని అపోజిషన్ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. విచారణ కొనసాగుతున్నది. ఎలాంటి కక్ష సాధింపు ధోరణి ప్రభుత్వం చూపించడం లేదు. ఈ కేసుపై బీజేపీ స్టాండ్ ఏంటో కిషన్ రెడ్డి చెప్పాలి. డ్రగ్స్ తీసుకోవడం మా జన్మహక్కు అనేలా కొందరు బీఆర్ఎస్ లీడర్లు మాట్లాడుతున్నరు. ప్రజలంతా గమనిస్తున్నరు.
పారదర్శకంగానే కేసు విచారణ జరుగుతున్నది. లా అండ్ ఆర్డర్‌ను కాపాడేలా ప్రభుత్వం వ్యవహరిస్తది. ఎవరిపై.. ఎలాంటి కక్ష సాధింపు చర్యలుండవు. మాది ప్రజా ప్రభుత్వం’’అని పొన్నం పేర్కొన్నారు.