ఫ్రీ బస్ జర్నీతో న‌ష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల్లోకి: మంత్రి పొన్నం ప్రభాకర్

ఫ్రీ బస్ జర్నీతో  న‌ష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల్లోకి: మంత్రి పొన్నం ప్రభాకర్

మహిళలకు ఫ్రీ బస్ జర్నీతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాట పట్టిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.  హైదరాబాద్ లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో టీజీఎస్ఆర్టీసీ పనితీరుపై మంత్రి పొన్నం రివ్యూ చేశారు. ఈ సమావేశంలో  మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్రయాణ సౌక‌ర్యం, కొత్త బ‌స్సుల కొనుగోలు, లాజిస్టిక్స్, ఆర్థిక ప‌ర‌మైన అంశాలపై  ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా  మాట్లాడిన పొన్నం.. మహిళలకు  ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆర్టీసీ సమర్థవంతంగా అమ‌లు చేస్తోంద‌న్నారు.  ఈ ప‌థ‌కంలో భాగంగా  నవంబర్  20 వ‌ర‌కు 111 కోట్ల జీరో టికెట్లను  సంస్థ జారీ చేసింద‌ని.. ఫ‌లితంగా రూ.3747 కోట్లను మహిళలు ఆదా చేసుకున్నార‌ని  తెలిపారు. 

మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ల్ల గ‌తంలో న‌ష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల్లోకి వెళ్లింద‌న్నారు మంత్రి పొన్నం. ఆర్టీసీకి ఇది  శుభ‌సూచ‌క‌మ‌న్నారు. ఈ ప‌థ‌కం అమ‌లుకు ముందు 69 శాతంగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్).. ప్రస్తుతం 94 శాతానికి పెరిగింద‌ని గుర్తు చేశారు.  మొత్తం ప్రయాణికుల్లో 65.56 శాతం మ‌హిళ‌లే ఉంటున్నార‌ని వివ‌రించారు. ఈ ప‌థ‌కాన్ని వినియోగించుకుంటోన్న మ‌హిళ‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోంద‌ని, ర‌ద్దీకి అనుగుణంగా కొత్త బ‌స్సుల కొనుగోలుకు ప్రణాళికను రూపొందించుకోవాల‌ని ఆర్టీసీ ఉన్నతాధికారులను  ఆదేశించారు. వీలైనంత త్వరగా కొత్త బ‌స్సులు అందుబాటులోకి వ‌చ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

2023  డిసెంబ‌ర్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ స‌హ‌కారంతో 1389 కొత్త బ‌స్సుల‌ను ఆర్టీసీ కొనుగోలు చేసింద‌ని తెలిపారు మంత్రి పొన్నం.  మొద‌టి విడ‌త‌లో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, క‌రీంన‌గ‌ర్, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ ఉమ్మడి జిల్లాల్లోని మ‌హిళా స్వయం స‌హాయ‌క బృందాల‌కు అద్దె బ‌స్సులను అంద‌జేయాల‌ని  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మ‌ర‌ణించిన, మెడిక‌ల్ అన్‌ఫిట్ అయిన సిబ్బంది జీవిత భాగ‌స్వాముల‌కు, పిల్లలకు ఇచ్చే కారుణ్య ఉద్యోగాల నియామ‌క ప్రక్రియను  వేగ‌వంతం చేయాల‌న్నారు.