- కూల్చాలని చూస్తే మొట్టికాయలు వేస్తరు: పొన్నం
కొత్తపల్లి, వెలుగు: కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వాన్ని ఎవరూ టచ్ కూడా చేయలేరని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తమ ప్రభుత్వం కూలిపోతుందని కొందరు నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్కు సమ్మక్క సారలమ్మ అండదండలు ఉన్నాయన్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని టచ్ చేయాలని చూస్తే అమ్మవారు మొట్టి కాయలు వేస్తుందని హెచ్చరించారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తిలో సమ్మక్క సారలమ్మను గురువారం ఆయన దర్శించుకుని బంగారం మొక్కు చెల్లించుకున్నారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మిగితా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూల్చినట్టు తెలంగాణలో కుదరదు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వానికి సహకారం అందించాలి కానీ.. కుట్రలు చేయొద్దు. సర్కార్ ఏర్పడి 70 రోజులు కూడా కాలేదు. అప్పుడే విమర్శలు చేస్తున్నరు’’అని మండిపడ్డారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామన్నారు. వచ్చే నెలలో మరో రెండు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటించారు. బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ ప్రజలకు తెలుసని, కిషన్ రెడ్డికి స్టేట్ చీఫ్ పదవి ఇప్పించిందే కేసీఆర్ అని ఆరోపించారు. కిషన్ రెడ్డిని ‘నామినేటెడ్ బై కేసీఆర్’అని పిలుస్తుంటారని ఎద్దేవా చేశారు.
పొన్నం వెంట డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కార్పొరేటర్లు ఏదుల్ల రాజశేఖర్, సుదగోని మాధవి, జాతర కమిటీ చైర్మన్ పిట్టల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.