సమన్వయంతో మొహర్రం ఏర్పాట్లు చేయండి​.. అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం

సమన్వయంతో మొహర్రం ఏర్పాట్లు చేయండి​..  అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మొహర్రం పవిత్ర మాసంలో నిర్వహించే కార్యక్రమాలకు అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం ఆయన సెక్రటేరియెట్​లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీతో కలిసి వివిధ శాఖల అధికారులు, షియా మత పెద్దలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. మొహర్రం ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. 

ఆశుర్ ఖానాల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయడంతోపాటు పరిసర ప్రాంతాల్లో డ్రైనేజ్, రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏనుగు ఊరేగింపు జరిగే మార్గాలలో ప్రత్యేక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని, తాగు నీరు, పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. 

ఆశుర్ ఖానాలకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సూచించారు. వైద్య శిబిరాలు, అంబులెన్స్​లను కూడా అందుబాటులో ఉంచాలని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీలు మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, మీర్జా రహమత్ బేగ్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్ మెరాజ్, కౌసర్ మొహియుద్దీన్, మీర్ జుల్ఫెకర్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ  కమిషనర్ అమ్రపాలి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.