కొత్తపల్లి, వెలుగు : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొత్తపల్లి మండలం బావుపేట (ఆసిఫ్‌నగర్)లో ఆదివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీగా రాజేందర్రావును గెలిపిస్తే ఏ సమస్య అయినా పరిష్కారంఅవుతుందన్నారు.
తమ ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని, ఆగస్టులో రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. వచ్చే వర్షాకాల పంటకు వరికి రూ.500 బోనస్ అందిస్తామని హామీ ఇచ్చారు. రాముడి పేరుతో ఓట్లు అడగడం మానుకుని, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని బీజేపీకి సవాల్ విసిరారు.
మోదీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యుల నడ్డి విరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తుందని తెలిపారు. బావేపేట మార్కెట్ యార్డును అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పిట్టల కరుణశ్రీ- రవీందర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.