మహిళలకు ఫ్రీ బస్ జర్నీపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ వేశారు. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాని స్థాయిలో ఉండి జీర్ణించుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాని స్థాయి దిగజార్చొద్దని హితవు పలికారు. ఫ్రీ బస్ జర్నీ వల్ల నష్టం జరుగుతుందని మోదీ మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయని చెప్పారు.
ఆర్టీసీ జర్నీకి, మెట్రో జర్నీకి సంబంధం లేదన్నారు మంత్రి పొన్నం. మెట్రో సెక్టార్ వేరని చెప్పారు. ఇప్పటికీ కూడా మెట్రోలో రైలు బోగీలు పెంచాలని కోరారు. రాజకీయ లబ్ధి కోసమే మోదీ దిగజారి మాట్లాడుతున్నారని తెలిపారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంలో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఇంకా కొత్త రూట్లు పెంచి కొత్త బస్సులతో పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.