గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం అభివృద్ధి

  • కొండపల్కలలో బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం 

మానకొండూర్, వెలుగు: గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మానకొండూర్ మండలం గంగిపల్లి, కొండపల్కల, నిజాయితీగూడెం గ్రామాల్లో బుధవారం పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. గంగిపల్లిలో నిర్మించిన బస్ షెల్టర్లు , ఓపెన్ జిమ్‌‌‌‌‌‌‌‌ను, నిజాయితీగూడెంలో జీపీ భవనాన్ని ప్రారంభించారు.

అనంతరం కొండపల్కల గ్రామంలో కరీంనగర్-– కొండపల్కల మధ్య నడవనున్న ఆర్టీసీ బస్సును ప్రారంభించి గంగిపల్లి వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా జిల్లా, మండల, గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తామన్నారు.  డిసెంబర్ 9 మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు.

ఇప్పటి వరకు 6.50 కోట్ల జీరో టిక్కెట్ల ద్వారా మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు వెల్లడించారు. తిమ్మాపూర్ లోని డ్రైవింగ్ స్కూల్ ట్రాక్ కు చొక్కారావు పేరు పెట్టినట్లు తెలిపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, మానకొండూర్ ఎంపీపీ సులోచన, ఎంపీటీసీలు భాస్కరాచారి, సంపత్, సర్పంచులు శాలిని, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.