గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : మంత్రి పొన్నం ప్రభాకర్​

  గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ (హుస్నాబాద్​) వెలుగు: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. మంగళవారం హుస్నాబాద్​ క్యాంపు ఆఫీస్​లో నియోజకవర్గంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యలను ఆఫీసర్లతో మాట్లడి అక్కడే పరిష్కరించారు. యువత తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రి దృష్టికి తీసుకురాగా బుధవారం క్యాంపు ఆఫీస్​లో జాబ్​ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే జాబ్​మేళాతో 5వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించామన్నారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల కాల్వల కోసం భూసేకరణ వేగంగా జరుగుతుందని త్వరలోనే ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్​స్వీప్​చేయడమే లక్ష్యంగా పని చేయాలన్నారు.