గాంధీ కుటుంబంపై బీజేపీ కక్షసాధింపు : మంత్రి పొన్నం ప్రభాకర్

గాంధీ కుటుంబంపై బీజేపీ కక్షసాధింపు : మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ(హుస్నాబాద్​), వెలుగు: దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబంపై బీజేపీ కక్ష సాధిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ వేయడాన్ని నిరసిస్తూ హుస్నాబాద్ లో ధర్నా చేపట్టారు. 85 ఏళ్ల వయసున్న సోనియా గాంధీని కూడా విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.  నీరవ్ మోదీ లాంటి వారు ఎంతో మంది దేశాన్ని దోచుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రధాని చెప్పాలని డిమాండ్​చేశారు. 

ఎకరాకు రూ.10 వేల పరిహారం..

వడగండ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి ప్రభాకర్ తెలిపారు. అక్కన్నపేట మండలం పంతులు తండాలో దెబ్బతిన్న పంటలను బుధవారం పరిశీలించారు. 

సిద్ధిపేట టౌన్, వెలుగు: దేశ సేవకు అంకితమైన గాంధీ కుటుంబంపై అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రధాని మోదీ ప్రభుత్వం కక్షసాధిస్తోందని కాంగ్రెస్ పార్టీ సిద్ధిపేట టౌన్ ప్రెసిడెంట్ అత్తు ఇమామ్ ఆరోపించారు. బుధవారం సిద్ధిపేటలోని ముస్తాబాద్ చౌరస్తాలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా ఫొటోను దహనం చేశారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, నాయకులున్నారు.

గజ్వేల్, వెలుగు: ఈడీ ముసుగులో ప్రధాని మోదీ ప్రతిపక్ష పార్టీలపై ప్రతీకార చర్యలు చేపడుతున్నారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర వైస్  ప్రెసిడెంట్ అంక్షారెడ్డి, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి,  వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ఆరోపించారు. గజ్వేల్ లో​ధర్నా నిర్వహించారు.