డబుల్ ఇండ్లున్న ఊర్లో ఓట్లు అడగం!

డబుల్ ఇండ్లున్న ఊర్లో ఓట్లు అడగం!

కొండగట్టు/మల్యాల, వెలుగు: ‘డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్న ఊళ్లలో మేం ఓట్లు అడగం, ఇందిరమ్మ ఇండ్లు ఉన్నచోట మీరు ఓట్లు అడగొద్దు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్​ను ఉద్దేశించి అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మంత్రి మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ లు కరీంనగర్ అభివృద్ధికి ఏం చేశాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నడూ కారులోంచి కాలు కింద పెట్టని వినోద్ కుమార్ ఇప్పుడేమో మార్నింగ్ వాక్‌ల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాడన్నారు. 

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ నాలుగో స్థానానికే పరిమితమవుతాడన్నారు. కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతో తాము 17 ఎంపీ స్థానాలు గెలుస్తామన్నారు. కొండగట్టు బస్సు యాక్సిడెంట్ జరిగితే సీఎం హోదాలో కేసీఆర్ ఒక్కసారి కూడా బాధితులను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. ఎమ్మెల్సీ కవిత కొండగట్టును అభివృద్ధి చేస్తానని మాట తప్పిందని, అందుకే జైలు పాలైందన్నారు. బీజేపీ నాయకులు బండి సంజయ్ మతపరమైన అంశాలు కాకుండా ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాముని అక్షింతలు, మరుగుదొడ్లు, ఉపాధి నిధులు, కాకుండా బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకువచ్చాడో బహిరంగ చర్చకు రావాలని సవాల్​విసిరారు. కొండగట్టు అంజన్న సన్నిధి నుంచే ఎన్నికల పోరును ప్రారంభిస్తున్నామన్నారు. 

గంగవ్వతో మంత్రి ముచ్చట

మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన మై విలేజ్‌ షో ఫేమ్ గంగవ్వ, టీం సభ్యులను కలిశారు. ‘ ఏం గంగవ్వ బాగున్నావా... సీఎం రమ్మన్నాడు ఎప్పుడు కలుద్దాం’ అని సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా లంబాడిపల్లిని రెవెన్యూ విలేజ్‌గా మార్చాలని గంగవ్వ మంత్రికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఆయన కలెక్టర్‌‌తో మాట్లాడారు. తిరిగి వెళ్తుండగా, మళ్లీ వచ్చినప్పుడు ఇంట్లో భోజనం ఏర్పాటు చేయమని మంత్రితో పాటు, విప్ ఆది శ్రీనివాస్ గంగవ్వను కోరారు. కాంగ్రెస్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు చెర్ల పద్మ, లీడర్లు ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, సతీష్ రెడ్డి, అనిల్, హరినాథ్, నర్సింహారెడ్డి, మై విలేజ్‌ షో మెంబర్స్ శ్రీకాంత్, అనిల్, చందు, అనిల్ కంటే,  శివ, రాజు, ప్రశాంత్, మధు, గంగారెడ్డి పాల్గొన్నారు.