
- పార్టీకి నష్టమని తెలిసినా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు
భీమదేవరపల్లి, వెలుగు: సోనియాగాంధీ లేకపోతే వందల మంది కేసీఆర్ లు ఉన్నా తెలంగాణ వచ్చేది కాదు. సోనియాగాంధీ తెలంగాణ తల్లి.. తెలంగాణ ఇచ్చింది ఆమేనని శాసనసభలో చెప్పిన మాటలు కేసీఆర్ మరిచిపోయారా’ అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్సే నంబర్ వన్ విలన్ అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ముల్కనూరు జంక్షన్ లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. అగ్గిపెట్టె రాజకీయాలు చేసి ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించడమే మీకు తెలుసని, ఉద్యమకారుడిగా తాను, తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ ప్రదాత సోనియాగాంధేనని, కాంగ్రెస్ పార్టే తెలంగాణ విలన్ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.