
- అభివృద్ధికి సహకరించడం లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్
- కేసీఆర్ కు బినామీగా ఉన్నాడని కామెంట్
- డెవలప్ మెంట్ ను అడ్డుకోవాలని కుట్రపన్నితే సహించబోమని వార్నింగ్
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్ర మంత్రిగా రాష్ర్ట అభివృద్ధికి సహకరించడం లేదని మండిపడ్డారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీడియాతో మంత్రి పొన్నం మాట్లాడారు.
బండి సంజయ్ ని తొలగించి కేసీఆర్ బినామీగా కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారని విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు ఎందుకు కార్యరూపం దాల్చడం లేదో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుకు సంబంధించి ఒక్క లెటర్ అయినా కేంద్రానికి రాశారా అని ప్రశ్నించారు. ‘‘కిషన్ రెడ్డిది తెలంగాణ రక్తం అయితే తెలంగాణ అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాలి. వరంగల్ఎయిర్ పోర్టు తన వల్లే వచ్చిందని పక్క రాష్ట్ర కేంద్ర మంత్రితో చెప్పించుకున్న ఘనత కిషన్ రెడ్డికే దక్కుతుంది.
తెలంగాణకు వచ్చే నిధులను ఆయన అడ్డకోకపోతే రాష్ర్ట అభివృద్ధికి ప్రాజెక్టులు ఎందుకు రావడం లేదు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరగడం కిషన్‌రెడ్డికి ఇష్టం లేదు. అభివృద్ధిని అడ్డుకోవాలని కుట్రలు పన్నితే సహించం” అని పొన్నం పేర్కొన్నారు. కులగణన రీసర్వేకు సంబంధించి గత నెల 16 నుంచి 28 వరకు అవకాశం ఇచ్చామని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుకు తాను స్వయంగా ఫారాలు పంపినా వివరాలు ఇవ్వలేదని వెల్లడించారు.
కులగణనపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని, దాన్ని కేంద్రంలో అమోదింపజేసే బాధ్యత రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రులదే అని స్పష్టం చేశారు. హైదరాబాద్-, కరీంనగర్, -నిజామాబాద్ వరకు 8 లైన్ల రహదారి వేయించాలని కేంద్రానికి నివేదించామని, దానికి ఇంతవరకూ స్పందన లేదన్నారు.