వేల కోట్లు పెండింగ్​లో పెట్టి.. సిగ్గు లేకుండా ట్వీట్లా.?: పొన్నం

వేల కోట్లు పెండింగ్​లో పెట్టి.. సిగ్గు లేకుండా ట్వీట్లా.?: పొన్నం

 

  • పదేండ్లలో గురుకులాలకు సొంత బిల్డింగ్​లు 
  • మీరెందుకు కట్టలేదు?
  • కేటీఆర్​పై విరుచుకుపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్​
  • పిల్లలతో రాజకీయాలు చేయొద్దని హితవు
  • బిల్డింగ్​లకు తాళాలు వేస్తే క్రిమినల్ చర్యలుంటాయని వార్నింగ్​

హైదరాబాద్, వెలుగు: అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు బిల్లులు పెండింగ్​లో ఉంచి ట్వీట్లు చేయడానికి కేటీఆర్​కు సిగ్గుండాలని మంత్రి పొన్నం ప్రభాకర్  ఫైర్​ అయ్యారు. పదేండ్లు అధికారంలో ఉండి  గురుకులాలకు సొంత బిల్డింగ్​లు ఎందుకు  కట్టలేదని ప్రశ్నించారు. మంగళవారం గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్​ మీడియాతో మాట్లాడారు.  గురుకులాల అద్దెకు సంబంధించి పెండింగ్ బిల్లుల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లామని, దశలవారీగా బిల్లులు రిలీజ్ చేస్తారని చెప్పారు. బిల్లులు చెల్లించే బాధ్యత తమదేనని స్పష్టం చేవారు.  నేడో రేపో బిల్లులు రిలీజ్ చేస్తున్న  టైంలో తాళాలు వేస్తూ  ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని సూచించారు.  

ఓనర్ల వెనుక ఎవరున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలతో రాజకీయాలు చేయొద్దని  హితవు పలికారు. గత ప్రభుత్వంలో రెంట్లు పెండింగ్ లో ఉంటే అప్పుడు ఏం చేశారని  ప్రశ్నించారు. అప్పుడు బకాయిలు అడగకుండా ఇప్పుడు తాళాలు వేస్తారా? అని మండిపడ్డారు. హాస్టళ్లు, స్కూళ్లకు తాళాలు వేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ఈ విషయంపై కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తామని అన్నారు. గురుకులాల ముందు అద్దెలు చెల్లించాలంటూ ఏర్పాటు చేసిన బ్యానర్లను వెంటనే తొలగించాలని మంత్రి కోరారు. ఓనర్లు ఇబ్బంది పెడితే స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని గురుకుల ప్రిన్సిపాల్స్, ఆర్సీవోలను మంత్రి ఆదేశించారు. ఈ పెండింగ్​ బిల్లులన్నీ గత సర్కారునుంచే ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో 70 శాతం గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. దసరా సెలవుల అనంతరం గురుకులాలు, కాలేజీలు , పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయని, ఈ సమయంలోనే కొన్నేండ్లుగా పెండింగ్​లో ఉన్న బకాయిలు అడగడమేంటని ప్రశ్నించారు. రెంట్ బకాయిలు ఉన్న ఓనర్లు తన దగ్గరకు రావాలని,  సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.  విద్యా బోధనకు అడ్డంకులు సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. 

పెండింగ్ బిల్లులన్నీ గత ప్రభుత్వంలోనివే: మంత్రి సీతక్క 

కేసీఆర్​వల్లే గురుకులాలకు తాళాలు వేసే పరిస్థితి వచ్చిందని, బకాయిలన్నీ గత ప్రభుత్వంలోనివేనని మంత్రి సీతక్క అన్నారు. కేవలం గురుకులాలకే కాకుండా.. అన్ని శాఖల్లో వేల కోట్ల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకుండా ఉంచారని అన్నారు. గురుకులాలకు తాళాలు వేస్తుంటే కేటీఆర్ ఆనందపడుతున్నారని ఆమె మండిపడ్డారు. అద్దె బకాయిలన్నింటినీ తాము చెల్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు.