- జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు
చిగురుమామిడి, వెలుగు: ప్రభుత్వం పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని, దీనిపై ప్రతిపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని, ఈ ప్రక్రియపై ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పదేండ్లుగా కొత్త రేషన్ కార్డులు, ఇండ్లు ఇవ్వని బీఆర్‌ఎస్ లీడర్లు.. తాము ప్రస్తుతం ఆ పని చేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే 90 లక్షలు రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. ఎప్పుడు తప్పులు లెక్కపెట్టే ప్రతిపక్షాలు సర్వేను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని, వాటి దుష్ర్పచారం నమ్మొద్దన్నారు. అర్హత ఉండి పదేండ్లుగా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు జనవరి 26 నుంచి జారీ చేస్తామని స్పష్టం చేశారు. కుల సర్వే ఆధారంగా అప్లికేషన్ల సమాచారం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు వస్తాయన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో భూమిలేని కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇవ్వబోతున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకే ఇచ్చేందుకు ప్రక్రియ ప్రారంభమైందన్నారు.