మోదీ మొఖంలో భయం కనిపిస్తుంది: పొన్నం ప్రభాకర్

మోదీ మొఖంలో భయం కనిపిస్తుంది: పొన్నం ప్రభాకర్

కరీంనగర్:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్  ఫైరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. హిందువుల సంపద ముస్లింలకు పంచుతారని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఏ ప్రధాని మాట్లాడనంత నీచంగా, రక్తపాతం సృష్టించే విధంగా మోదీ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు పెరిగిన ఆదరణను చూసి మోదీ భయపడుతున్నారని.. ఆయన  ముఖంలో భయం కనిపిస్తుందని పొన్నం అన్నారు.

కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మే11వ తేదీ శనివారం ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.  శివాజీ విగ్రహాలు ఎన్నికలప్పుడే బీజేపీకి గుర్తొస్తాయన్నారు. 400 సీట్లు అడిగి రాజ్యాంగం మార్చాలని చూస్తోన్న బీజేపీపై కేసీఆర్ వైఖరి చెప్పాలన్నారు. కాంగ్రెస్ మాత్రమే దేశంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుందన్నారు.  కాంగ్రెస్ విజయం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి అవసరమని అన్నారాయన.

మార్పు కోరుకుని మీరు తెచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేయాలంటే.. కాంగ్రెస్ ను ఎంపీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.   కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని పిల్లి శాపనార్థాలు పెట్టిన వాళ్లకు ఈ ఎన్నికలతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ నుంచి మాకు బలాన్ని ఇవ్వాలని.. అప్పుడే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు మంచి అవకాశం ఉంటుందన్నారు.

సిరిసిల్ల సంక్షోభంలో పడినా టెక్స్ టైల్ జోన్ ను వరంగల్ కు తరలించినా.. అప్పటి ఎంపీ వినోద్ పట్టించుకోవడం లేదని మంత్రి విమర్శించారు.  బండి సంజయ్ వివాదాలతో గుర్తింపు పొందారని.. ఆయన ఎంపీగా కరీంనగర్ కు ఏం చేయలేదని చెప్పారు. త ల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ మాట్లాడితే.. పార్లమెంట్ లోనే ఉన్న బండి సంజయ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తాము తెలంగాణ కోసం ఆనాడు మాపార్టీతోనే కొట్లాడామని గుర్తు చేశారు. కరీంనగర్ లో తామంతా ఐక్యంగా పనిచేసామని... మా గెలుపు తథ్యమని మంత్రి పొన్నం అన్నారు.