- పనికొచ్చేవి చెప్పండి.. ఎప్పుడూ విమర్శలేనా?
- సమగ్ర సర్వే రిపోర్టు ఎందుకు బయటపెట్టలే
- బీఆర్ఎస్లీడర్లను చిత్తశుద్ధి లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: ఇచ్చిన హామీ ప్రకారం కులగణనపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చాటుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. . ఇందుకోసం సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ‘గత ప్రభుత్వంలోని నేతలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే మాపై ఇష్టానుసారం మాట్లాడుతున్నరు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీర్మానంపై అనుమానం వ్యక్తం చేయడం శోచనీయం.
బీఆర్ఎస్హయాంలో సకల జనుల సర్వే చేపట్టింది. దానికి సంబంధించిన రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదు? ఇవాళ ఇంత పెద్దగా మాట్లాడుతున్న ఆయన.. ఆ నివేదికను బయటపెట్టాలని ఏనాడైనా ఆ పార్టీ సమావేశాల్లో అడగాలని అనిపించలేదా? అలాంటి స్థితిలో ఉన్నవారు కూడా మాపై విమర్శలు చేస్తున్నరు. ప్రజలు, నాయకులు.. ఇలా అందరి సలహాలు, సూచనలను తీసుకొనేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో చెప్పారు.
సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు ఏమైనా చెప్పండి అంటే చెప్పరు.. ఎంతసేపూ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నరు. కులగణన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతిఒక్కరి సహాయసహకారాలు ప్రభుత్వానికి అవసరం’ అని మంత్రి తెలిపారు.