కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులతో కలిసి ఉత్తమ్ పరిశీలించారు. ఇంజినీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంబట్‌పల్లి గ్రామంలోని ఎల్‌అండ్‌టీ కంపెనీ ఆఫీస్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు తదితర అంశాలపై నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వానికి మానస పుత్రిక. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు భూమిలోకి కుంగినప్పుడు పెద్ద శబ్దం వస్తే బాంబులు పెట్టి పేల్చి ఉంటారని ఇంజనీర్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు. అప్పటి రాష్ట్ర సర్కారు పెద్దల ఒత్తిడి మేరకే ఇలా ఫిర్యాదు చేశారు. బ్యారేజీలో 10 టీఎంసీల నీళ్లుండగా బాంబులు పెట్టేంత శక్తి పాకిస్తాన్ తీవ్రవాదులకు కూడా లేదు. అలాంటిది ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అలా కంప్లైంట్ చేశారు’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ముంపు వల్ల వేలాది ఎకరాల్లో పంటలు భూములు మునుగుతున్నా అప్పటి సర్కారు నష్టపరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. ఇదేదో గొప్ప ప్రాజెక్టు అని అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని, తీరా బ్యారేజీలు కుంగిపోతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.