- రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
- నియమాలు పాటించడం ప్రతిఒక్కరి సామాజిక బాధ్యత
- రహదారి భద్రతను స్కూళ్లలో పాఠ్యాంశంగా తెస్తామని వెల్లడి
- నిరుడు రాష్ట్రంలో 26 వేల రోడ్డు ప్రమాదాల్లో
- 7,700 మంది మృతి: రవాణా శాఖ కమిషనర్
హైదరాబాద్‌సిటీ/ముషీరాబాద్, వెలుగు : ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి ప్రమాదాలకు కారణమయ్యే వారికి లైసెన్సు రద్దు చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్‌మార్గ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వరకు వాకథాన్ నిర్వహించారు. మంత్రి పొన్నం జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన కూడా వాకథాన్‌లో పాల్గొన్నారు. తర్వాత హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు.
వాహనదారులకు, ప్రజలకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పిస్తామని, అయినా రూల్స్ పాటించకపోతే కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. రహదారి భద్రతను విద్యార్థులకు పాఠ్యాంశంగా ప్రవేశపెడతామని వెల్లడించారు. ట్రాఫిక్ రూల్స్పాటించడం ప్రతిఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. జనవరి1న సీఎంకు హెల్మెట్ బహూకరించి రోడ్డు భద్రత మాసోత్సవాలు ప్రారంభించామని, 15 లక్షల మంది విద్యార్థులను భాగస్వామ్యం చేసి 33 జిల్లాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించిన రవాణా శాఖ అధికారులను అభినందిస్తున్నానన్నారు.
Also Read :- భోజాగుట్టలో కుంగిన పైపులైన్
రాష్ట్రంలో ఎక్కువ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి యాక్సిడెంట్స్ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రూల్స్బ్రేక్ చేసి ఇతరుల ప్రాణాలు పోవడానికి కారకులైన వారిని దోషిగా నిలబెడతామన్నారు. రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ మాట్లాడుతూ దేశంలో నిరుడు 5.70 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఆ ప్రమాదాల్లో 1,68,491 మంది చనిపోయారని, 4,43,366 మంది గాయపడ్డారని తెలిపారు. అలాగే, రాష్ట్రంలో 26 వేల రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 7,700 మంది ప్రాణాలు కోల్పోయారని, 20 వేల మంది గాయపడ్డారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రోజుకు సగటున 18 మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్ విజయా రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.