
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. టెంపరరీగా బావులు తీసుకోవాలని, అవసరమైతే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలన్నారు. ఆదివారం హుస్నాబాద్ ఐవోసీ ఆఫీస్‌లో నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలని పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వరి కోతలు జరుగుతున్నాయని, కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తామన్నారు. ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అప్లికేషన్ల్లో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. అనంతరం గీత కార్మికులకు సేప్టీ కిట్స్ పంపిణీ చేశారు.
జూన్ తర్వాత రాష్ర్టంలో 40 లక్షల తాటి, ఈత మొక్కలను నాటుతామని చెప్పారు. పార్టీ ఆఫీస్‌లో జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 26, 27, 28 తేదీల్లో మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు. అంతకు ముందు వైశ్య భవనంలో ఏసీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్సుజాత, జిల్లా లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, గీత కార్పొరేషన్ఎండీ ఉదయ్ ఉన్నారు.